మిత్రపక్షాల మధ్య ‘గిల్లికజ్జాలు’ ముదిరి పాకాన పడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఒకరి మీద ఒకరు ఛలోక్తులు విసురుకుంటున్నారు.. ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ‘జనసేన మాకు మిత్రపక్షమే కాదు..’ అని తెలంగాణ బీజేపీ మహిళా నేత డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు, అంతకు ముందు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత స్పందించడమే కాదు, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మిత్రపక్షం బీజేపీకి కాకుండా, తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఇక, ఏపీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన తమకు ఎదురైన ఎదురు దెబ్బకి కారణం బీజేపీ అని తేల్చేసింది. ‘బీజేపీతో స్నేహాన్ని కృష్ణా నదిలో కలిపేశాం..’ అంటూ జనసేన నేత పోతిన మహేష్ స్పష్టం చేశారు.
అంటే, తెలంగాణలో జనసేనను బీజేపీ హుస్సేన్ సాగర్‌లో కలిపేసినట్టు.. అన్న మాట. ఈ గిల్లికజ్జాల్లో నిజమెంత.? డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే ఇదంతా జరుగుతోందా.? అన్న అనుమానాలూ లేకపోలేదు. ఓ బలమైన రాజకీయ శక్తిగా తెలుగునాట ఎదగాలనుకుంటోన్న జనసేన, ఇతర రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం మానేసి, సొంతంగా ఎదగడం మీద దృష్టిపెట్టాల్సి వుంది. ఏడేళ్ళ ప్రస్తానంలో జనసేన సాధించింది ఒక్క ఎమ్మెల్యే.. కొన్ని పంచాయితీలకు ప్రెసిడెంట్లు.. కొందరు వార్డు మెంబర్లు.! మెగాస్టార్ చిరంజీవే నయ్యం.. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, అసెంబ్లీలో సీట్లు సంపాదించారు. జనసేన పార్టీ, నానాటికీ తీసికట్టుగా మారుతోందంటే, నాయకత్వ వైఫల్యం సుస్పష్టమిక్కడ. బీజేపీతో కలిసి జనసేన ప్రయాణం కొనసాగిస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. కానీ, మిత్రపక్షంతో కలిసి వుండాలనుకుంటే.. ఆ కలయిక మరింత బలంగా వుండేలా చూసుకోవాల్సిందే.