నూతన రాజకీయాలను చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయోమయంలో పడ్డారు. తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, బీజేపీతో పొత్తు కేవలం ఏపీకి పరిమితమని ప్రకటించిన ఒక్కరోజు తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదు, మాపూర్తి మద్దతు బీజేపీకేనని ప్రకటించారు. ఇలా అయోమయంలో ఉన్న జనసేన అధినేత గత కొద్దీ రోజుల నుండి బీజేపీపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ కోపానికి గల కారణాలను తెల్సుకోవడాని పవన్ కళ్యాణ్ ను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిచారని సమాచారం.
కమ్యూనికేషన్ గ్యాప్ ను పూడ్చనున్న బీజేపీ పెద్దలు
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ – జనసేన పొత్తు కొనసాగుతోంది. అయితే, మిత్రపక్షాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఆ ‘గ్యాప్’ స్పష్టమైపోయింది. గ్యాప్ వంటి విషయాలపై బీజేపీ అధిష్టానం తగు చర్యలు చేపట్టాలని అనుకుంటోందట. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఢిల్లీ బీజేపీ పెద్దలు పిలిపించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ, తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు నేతలూ, ఢిల్లీ పెద్దల భేటీకి హాజరవుతారని సమాచారం. ఇదిలా వుంటే, గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం విషయమై పవన్ కళ్యాణ్‌ని ఢిల్లీకి బీజేపీ అగ్రనాయకత్వం పిలిపించుకుందనే వాదనలూ లేకపోలేదు.
పవన్ బీజేపీని అడగనున్న ప్రశ్నలు
ఢిల్లీ టూర్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సహా అనేక అంశాలపై జనసేనాని, బీజేపీ అగ్రనాయకత్వం నుంచి స్పష్టత కోరబోతున్నారట. తిరుపతి ఉప ఎన్నికపైనా చర్చించనున్నారట జనసేనాని. మిత్రపక్షం జనసేనతో సంప్రదించకుండా గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ సొంతంగా అభ్యర్థుల్ని ప్రకటించేయడం, తిరుపతి ఉప ఎన్నికల విషయంలోనూ తొందరపాటు చర్యలు తీసుకోవడం.. వంటి విషయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనాయకత్వానికి ఓ నివేదిక అందించనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.