తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కచ్చితంగా పోటికి దింపాలని జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. బీజేపీకి సీటు కేటాయించి వారికి సహకరించాలంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని వారు పేర్కొన్నట్లు సమాచారం. తిరుపతిలో గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది.
అనంతరం పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పవన్ కల్యాణ్‌కు వాస్తవ పరిస్థితులు వివరించారు. తిరుపతిలో బీజేపీకి గెలిచే సీన్ లేదని చెప్పినట్లు తెలిసింది. బీజేపీ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహకరించబోమని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో కనుక జనసేన నిలిస్తే ఏడు నియోజకవర్గాల్లోనూ తానే ప్రచారం చేస్తానని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో నిన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అభ్యర్థిపై మరో వారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం మరోమారు సమావేశం కానున్నట్టు చెప్పారు. కాగా, తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైనప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి షెడ్యూలు విడుదల కాలేదు.