ఈ మధ్యకాలంలో బంగారు నగలు ధరించి మహిళలు ఒంటరిగా రోడ్లమీద వెళ్ళటానికి భయపడుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించటానికి కొందరు వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రోడ్లమీద ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసి వారి మెడలో ఉన్న మంగళసూత్రాలు దొంగలిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఇలా చైన్స్ స్నాచర్ దొంగతనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు పోలీసుల కంటపడకుండా చాకచక్యంగా తప్పించుకొని పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. తాజాగా జనగామ జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. దానికోసం దొంగతో పోరాడిన మహిళ కన్న బిడ్డను పోగొట్టుకుంది.
వివరాల్లోకి వెళితే… జనగామ జిల్లా అంబేద్కర్ నగర్ కాలనీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న బాస్కర్, ప్రసన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు. భాస్కర్ పనికి వెళ్లిన తర్వాత ప్రసన్న తన 9 నెలల కూతురితో కలిసి ఇంటి వద్ద ఉంటుంది. ప్రసన్న ఒంటరిగా ఉండటం గమనించిన ఒక దొంగ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో ఆమె మెడలోని బంగారు తాళిని లాక్కెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రసన్న తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఉన్న తొమ్మిది నెలల పసిబిడ్డను తీసుకెళ్లి ఇంటి ముందు ఉన్న సంపులో పడేశాడు. వెంటనే గోడదూకి అతని కోసం వేచి చూస్తున్న వ్యక్తితో కలిసి బైక్ మీద తప్పించుకున్నాడు.
తొమ్మిది నెలల పసిబిడ్డను సంపులో పడేయటంతో ప్రసన్న గట్టిగ కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు అక్కడికి చేరుకొని సంపులో మునిగిన తొమ్మిది నెలల బాలికను బయటకి తీశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో బాలిక మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పసిబిడ్డ ఇలా మిగతాజీవిగా మారడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాళి కోసం చూసుకుంటే కన్న కూతురు దూరమైందంటు ప్రసన్న రోదన అక్కడివారిని కలిచివేసింది. ఈ ఘటనపై భాస్కర్,ప్రసన్న దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. బంగారం కోసం వచ్చిన దొంగ పాపని సంపులో పడేసి బంగారం వదిలేసి ఎందుకు వెళ్లాడనె అనుమానంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.