టీడీపీతో జనసేన కలవాలట.. కానీ, ఎందుకు.?

పాపం తెలుగుదేశం పార్టీ.. జనసేన ఎలాగైనా తమతో కలవాలని చాలా చాలా గట్టిగా కోరుకుంటోంది. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో కింది స్థాయిలో టీడీపీ, జనసేన మధ్య ‘అవగాహన’ బాగానే కుదిరింది. ఫలితాలొచ్చాయ్.. కొన్ని చోట్ల టీడీపీ చేసిన సాయం కారణంగా జనసేన, జనసేన చేసిన సాయం కారణంగా టీడీపీ గెలవడం.. ఆ స్వల్ప గెలుపుతో, కొన్ని సీట్లను దక్కించుకునేందుకు నానా తంటాలూ పడుతుండడం తెలిసిన విషయమే. ‘ఈ కలయిక అద్భుతం.. ఇదే కలయిక 2024 ఎన్నికల్లోనూ కొనసాగాలి..’ అంటూ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తాజాగా సెలవిచ్చారు. ‘విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తేనే, అధికార పార్టీ అరాచకాల్ని ఎదుర్కోగలం..’ అంటున్నారు పితాని. అయితే, జనసేన పట్ల చాలా ఆశగా చూస్తున్న టీడీపీ, తెరవెనుకాల జనసేనను దెబ్బకొట్టే వ్యూహాల్నీ రచిస్తోంది.

‘జనసేన మాకు మిత్రపక్షమే..’ అంటూ టీడీపీ జెండాల మీద జనసేన నేతల ఫొటోల్ని పెట్టేస్తున్నారు టీడీపీ నేతలు. అది కాస్తా, జనసేనకు సంకటంగా మారుతోంది. జనసేన – బీజేపీ మధ్య అధికారికంగా స్నేహం కొనసాగుతోన్న విషయం విదితమే. ఈ క్రమంలో అసలు మిత్రపక్షం ముందు, వెకిలి మిత్రపక్షం చేష్టలతో జనసేన ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జనసేనకు ఇంకో ఆప్షన్ లేదనే స్థాయికి ఆ పార్టీని నాశనం చేసెయ్యాలని టీడీపీ కంకణం కట్టుకున్నట్టుగా వుంది పరిస్థితి. అయితే, టీడీపీ.. టీడీపీ అనుకూల మీడియా చేస్తోన్న ఈ ప్రచారంతో జనసేన తేరుకోలేకపోతోంది. 2024 ఎన్నికల్లో జనసేన – బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ, టీడీపీ రాజకీయాలతో ఈలోపులే బీజేపీ – జనసేన విడిపోయేలా వున్నాయ్.