రోడ్లకి గుంతలు: వైసీపీకి షాకిస్తోన్న జనసేన.. ఎదురుదాడి ఎక్కడ.?

ఇవేం రోడ్లు మహాప్రభో.? వీటినసలు రోడ్లని అనగలమా.? అని ప్రతి ఒక్కరూ నిర్ఘాంతపోతున్నారు.. ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిని చూసి. ప్రపంచమంతా ఈ పరిస్థితిని చూస్తోంది. ఎందుకంటే, జనసేన పార్టీ అంతలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని ప్రచారంలోకి తీసుకొస్తోంది గనుక. జనసేన ఉద్దేశ్యం, అధికార వైసీపీని ఇరకాటంలో పడేయడమే కావొచ్చు. లేదా, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలనే సంకల్పం కావొచ్చు. కారణం ఏదైనా, జనసేన చేస్తున్న ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ పరువు బజార్న పడుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైనా సొంత వాహనాల్లో వెళ్ళాలంటే భయపడాల్సిందే. అలా వున్నాయి రోడ్ల మీద గుంతలు. ఫలానా గ్రామంలో, ఫలానా టౌన్‌లో, ఫలానా పట్టణంలో, ఫలానా నగరంలో.. అంటూ ఆయా ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితిని కళ్ళకు కట్టేలా చూపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా జనసేన శ్రేణులు.

ఇవన్నీ వాస్తవాలే. వీటిని కాదనడానికి వీల్లేదు. అధికార వైసీపీ అయితే, ఈ రోడ్ల దుస్థితిపై విపక్షాల్ని తప్పుపట్టడానికి వీల్లేనంత అయోమయంలోకి వెళ్ళిపోయింది. రోడ్ల దుస్థితి ఏంటో అందరికన్నా ఎక్కువగా వైసీపీ నేతలకే తెలుసు. ప్రభుత్వం తరఫున ప్రచార కార్యక్రమాల కోసం వెళ్ళే క్రమంలో ఆయా రోడ్ల మీద వైసీపీ నేతలు పడుతున్న పాట్లు అలాంటివి. అయినాగానీ, రోడ్ల విషయంలో అధినేతను ఒప్పించలేకపోతున్నారా.? ప్రభుత్వం ద్వారా పనులు చేయించలేకపోతున్నారా.? ఈ వైఫల్యాలకి కారణమేంటి.? వేల కోట్లు, లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న గుంతల రోడ్ల విషయంలో ఎందుకు ముందడుగు వేయలేకపోతోందో అర్థం కావడంలేదు. ఒక్కటి మాత్రం నిజం.. వైసీపీ హయాంలోని గుంతల రోడ్లు, జనసేన పార్టీకి రాజకీయంగా మైలేజీని ఇస్తున్నాయి.