Jaggareddy : తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన చాలామంది కాంగ్రెస్ నేతల్లో ఆయనా ఒకరు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు రాజకీయ రచ్చ కాంగ్రెస్ పార్టీలో చెలరేగుతుంటుంది. ఔను, కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవు అవసరం లేదు. ఎందుకంటే, ఆ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేస్తుంటారు అవకాశం చిక్కినా, చిక్కకపోయినా.
ఇప్పుడిదంతా ఎందుకంటే, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చాలా ఇబ్బందికరంగా కొనసాగుతున్న జగ్గారెడ్డి, రాజీనామాస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించేశారు. దాంతో, వీహెచ్ తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
జగ్గారెడ్డి ఆశించిన మేర కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి బుజ్జగింపులు రావడంతో, ప్రస్తుతానికి ఆయన కాస్త మెత్తబడ్డారు. అయినాగానీ, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఖాయమనీ.. స్వతంత్రంగానే ప్రజాసేవ చేస్తాననీ, ఏ పార్టీలోనూ చేరబోననీ జగ్గారెడ్డి తాజాగా సెలవిచ్చారు.
కాగా, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికవడాన్ని జగ్గారెడ్డి గత కొంతకాలంగా జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడవడం వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అదనంగా ఒరిగిన లాభమేమీ లేదన్నది జగ్గారెడ్డి వాదన.
తనను తీవ్రంగా అవమానిస్తున్నారనీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల తాలూకు సైన్యమే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని జగ్గారెడ్డి వాపోతున్నారు.