వైఎస్ జగన్ మార్కు ఝలక్: ఆ వారసులంతా ఏమైపోవాలి చెప్మా.?

YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీలో సీనియర్ నాయకులకు ఝలక్ ఇచ్చారు. వారి వారసులకూ సూపర్ షాక్ ఇచ్చారు. ‘మీ వారసుల్ని జనానికి పరిచయం చేయండి.. తప్పు లేదు. కానీ, వచ్చే ఎన్నికల్లో మాత్రం మీ వారసులు కాదు, మీరే పోటీ చెయ్యాలి..’ అని ఇటీవల పార్టీ సీనియర్‌లకు తేల్చి చెప్పారు వైఎస్ జగన్.

ఈ వ్యవహారంపై వైసీపీ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా కొందరు రిటైర్మెంట్ వయసులో వున్నారు. అంటే, రాజకీయాల పట్ల వైరాగ్యం వచ్చిందని కాదుగానీ, ఇప్పుడున్న రాజకీయాల కారణంగా మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అలాంటివాళ్ళంతా, తమ వారసుల్ని రంగంలోకి దించేస్తున్నారు.

వైసీపీ అంటే, యువరక్తం మెండుగా వున్న పార్టీ. వైఎస్ జగన్ యువ నాయకుడు. దాంతో, ఆయన బాటలోనే ఆయా సీనియర్ నేతల వారసులు కూడా రాజకీయాల్లోకి వచ్చారు, వస్తూనే వున్నారు. గత కొంతకాలంగా సీనియర్ నేతల కంటే ఎక్కువగా, వారి వారసులే జనంలో వుంటున్నారు.

సహజంగానే వారసుల్లో కొంత దూకుడు వుంటుంది. అది పార్టీకి బలం మాత్రమే కాదు, బలహీనత కూడా. కుర్ర చేష్టల కారణంగా పార్టీ భష్టుపట్టిపోయే అవకాశం వుంటుంది. అందుకే, 175 నియోజకవర్గాల్లోనూ గెలివాలనే టార్గెట్ పెట్టుకున్న వైఎస్ జగన్, ఈసారి వారసులకు మొండిచేయి చూపనున్నట్లు చెప్పకనే చెప్పేశారు.

కానీ, సీనియర్ నేతలు మాత్రం ‘ఇలాగైతే ఎలా.?’ అని ఆఫ్ ది రికార్డుగా ప్రశ్నిస్తున్నారు. అయితే, అధినేత నిర్ణయాన్ని ఎవరూ కాదనలేని పరిస్థితి. సీనియర్ల పరిస్థితి ఇలా వుంటే, ‘మేమే పోటీ చేస్తున్నాం..’ అని అనుచరులకు చెప్పేసుకుని, జనానికీ ఆ విధమైన సంకేతాలు పంపేసిన యువ నాయకత్వం.. అయోమయానికి గురవుతోందిప్పుడు