చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ బాబులు ప్రతి ఏడాది తమ తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తూ, తాము కేవలం పాలు , కూరగాయలు హెరిటేజ్ ద్వారా అమ్ముతూ తాము చాలా నిజాయితీగా సంపాదించుకుంటున్నామని చాలా గొప్పగా చెప్పుకుంటారు. అయితే నారా వారి సంస్థ అయిన హెరిటేజ్ యొక్క చరిత్ర గురించి నిజాయితీ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
తమ సంస్థ అభివృద్ధి కోసం దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి చిత్తూరు సహకార సంఘం డైయిరీని చంద్రబాబు ఏ విధంగా నిర్లక్ష్యం చేసి, దానిని నిర్వీర్యం చేశాడో అనేక సందర్భాల్లో వైసీపీ నేతలు కళ్ళకు కట్టినట్లు చెప్పారు. అలాంటి పునాదుల మీద ఎదిగిన హెరిటేజ్ కు భారీ షాక్ ఇవ్వటానికి జగన్ సర్కార్ ఏకంగా ప్రపంచంలోనే 8 వ స్థానంలో ఉన్నంటువంటి అమూల్ సంస్థను ఆంధ్రాలో బలోపేతం చేస్తున్నాడు.
ఇప్పటికే జరిగిన ఒప్పందం ప్రకారం తొలి దశలో 7 వేల యూనిట్ల పాడి పశువుల పంపిణీ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లక్ష యూనిట్లు, ఆగస్టులో 3 లక్షల యూనిట్ల పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాలలో పాలసేకరణ, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ లు ఏర్పాటు చేస్తున్నామని మహిళలకు శాశ్వత ఆదాయం ఉండేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని, లీటరుకు రూ. 5 నుంచి 7 వరకు పాడి రైతులకు ఆదాయం కలుగుతుందన్నారు. పాలు సేకరించిన 10 రోజులలోపే పాడి రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుందని సీఎం జగన్ చెప్పారు.
ఇవాళ సచివాలయంలోని మొదటి బ్లాక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎ జగన్ ఏపీ అముల్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఏపీ అముల్ వెబ్ సైట్, డ్యాష్ బోర్డును ప్రారంభించారు. గుజరాత్ కు చెందిన అమూల్ తో ఒప్పందం వల్ల పాడి రైతులకు మేలు జరుగుతుందని, మార్కెట్లో పోటీతత్వం ఉంటేనే రైతులకు ఎక్కువ మేలు జరుగుతుందని జగన్ అన్నారు. విశేషం ఏమిటంటే హెరిటేజ్ కోసం ఏ జిల్లా యొక్క సహకార డైయిరీని నిర్వీర్యం చేశాడో , అదే జిల్లా అయిన చిత్తూరులో పాల సేకరణ కోసం తొలిదశలో 400 కేంద్రాలలో ఏర్పాటు చేసి ప్రారంభించాడు సీఎం జగన్. ఒక రకంగా చెప్పాలంటే హెరిటేజ్ అభివృద్ధిలో కీలకమైన చిత్తూరు నుండే ఆ సంస్థ కు చెక్ పెట్టె కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించాడని అనుకోవాలి.