YS Jagan : ఏపీ రాజధానిపై స్పష్టతనివ్వనున్న వైఎస్ జగన్.!

YS Jagan : 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం అత్యంత కీలకం కాబోతోందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రాజధాని రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం.. అన్న విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. చంద్రబాబు హయాంలో అమరావతి పేరుతో దోచుకున్నారన్నది వైసీపీ ఆరోపణ. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారన్నది టీడీపీ ఆరోపణ.

ఏకైక రాజధాని అమరావతి.. అంటూ విపక్షాలు నినదిస్తోంటే, మూడు రాజధానులతోనే అభివృద్ధి.. అన్నది వైసీపీ వాదన. ఇందులో ఏ వాదన సరైనది.? అన్నదానిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయనుకోండి.. అది వేరే సంగతి. అయినాగానీ, రాష్ట్రానికి రాజధాని లేదు.. అన్న భావన రాష్ట్రంలోని ప్రజలందర్నీ కలచివేస్తోంది.

ఈ విషయమై కింది స్థాయి నుంచి నివేదికలు ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికప్పుడు అందుతూనే వుంటాయి. మూడు రాజధానుల చట్టాన్ని జగన్ సర్కారు వెనక్కి తీసుకున్నాక, మూడు రాజధానులకు మద్దతుగా ఏ ప్రాంతం నుంచీ సరైన స్పందన రాలేదు. హైకోర్టు ఎప్పుడైతే ఏకైక రాజధాని అమరావతికి అనుకూలంగా తీర్పునిచ్చిందో.. అప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హర్షం వ్యక్తమయ్యింది.

ఈ నేపథ్యంలో అమరావతిని రోల్ మోడల్‌గా చూపించి, మిగతా రెండు.. అంటే విశాఖ, కర్నూలులో అంతకు మించిన అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలకు చెప్పాల్సిన అవసరం జగన్ సర్కారుకి వచ్చి పడింది. దాంతో, అమరావతి విషయమై వైఎస్ జగన్ అతి త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఒకవేళ రాజధాని విషయంలో జగన్ సర్కారు వెనక్కి తగ్గితే మాత్రం.. అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. వెనక్కి తగ్గడమంటే ఓడిపోయినట్టు కానే కాదు. ఈ విషయాన్ని వైసీపీ గుర్తెరుగుతుందా.? వేచి చూడాల్సిందే.