AP: జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖమంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన గత ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో వైసిపి నాయకులకు పరిపాలన ఏమాత్రం చేతకాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేశారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా పారదర్శకత పాటించలేదని ఈయన విమర్శించారు.
వైసిపి నాయకులు అన్ని వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చేసి వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలను దగా చేశారని విమర్శలు కురిపించారు. యువత, విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు పోరాటం చేస్తామని మాట్లాడటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతోనే వైసీపీ తమని మోసం చేసిందని గ్రహించిన యువత కూటమి పార్టీలకు మద్దతుగా నిలిచారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
యువతను మోసం చేయటం వల్లే పట్టభద్రుల ఎన్నికలలో వైసీపీకి తమ ఓట్లతో యువత బుద్ధి చెప్పారని ఈయన గుర్తు చేశారు.వైసీపీ వాళ్లవి దగా పోరాటాలని వ్యాఖ్యానించారు. వాలంటీర్లను రాజకీయంగా వాడుకొని మోసం చేసింది జగనే అని ఆయన ఆరోపించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఏ వర్గాలైతే తీవ్రంగా నష్టపోయాయో వారందరూ కూడా ఇప్పుడు కూటమి పార్టీకి మద్దతుగా నిలిచి అఖండమైన విజయాన్ని అందించారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇక ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శించడమే కాకుండా జనసేన గురించి గొప్పగా మాట్లాడుతూ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు కూడా సీఎం కాలేడంటూ విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.