గత కొద్దీ రోజులుగా కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గం గురించి, అక్కడి వైసీపీలోని వర్గ రాజకీయాల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. టీడీపీ తరుపున గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న వల్లభనేని వంశీ కి, గత ఎన్నికలో పోటీచేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి నెలకొని వుంది. ఒక దశలో ఇక రాజకీయాల నుండి సన్యాసం తీసుకోబోతున్న అనే స్థాయికి వల్లభనేని వంశీ వచ్చాడంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇవన్నీ అధినేత దృష్టికి వెళ్లే ఉంటాయి. కాకపోతే సరైన సమయం కోసం చూస్తున్న సీఎం జగన్ నిన్నటి విద్య కానుక కార్యక్రమాన్ని ఆ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిరించటానికి వాడుకున్నట్లు సృష్టంగా తెలుస్తుంది. నిన్నటి కార్యక్రమానికి వంశీ, యార్లగడ్డ ఇద్దరు నేతలు వచ్చి పక్క పక్కనే నిలబడి వున్నారు. వచ్చిన నేతల్ని పలకరించడానికి వెళ్లిన జగన్, వాళ్లతో మాట్లాడి ఇద్దరి చేతులను కలుపుతూ, కలిసి పనిచేయాలని ఆయా నేతలకు జగన్ పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో జగన్ ఇద్దరి వైపు నవ్వుతూ చూడటం విశేషం. దీనితో పక్కనే ఉన్న వంశీ సైలెంట్ గా వున్నాడు, యార్లగడ్డ ఎదో చెప్పబోతుండగా సీఎం జగన్ ముందుకి వెళ్ళిపోవటం జరిగింది.
గతంలోనే యార్లగడ్డ ఒక వేదిక మీద మాట్లాడుతూ వల్లభనేని వంశీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక తాను పార్టీలో ఉండకూడదు అనుకున్నానని, అదే విషయాన్నీ సీఎం జగన్ ముందు చెప్పటం కూడా జరిగిందని, కాకపోతే నియోజకవర్గంలో తనని నమ్ముకున్న కార్యకర్తల కోసం పార్టీలో కొనసాగుతున్నానని , అంతే తప్ప వంశీతో కలిసి పనిచేసేది లేదని తెగేసి చెప్పాడు. ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ స్వయంగా ఇద్దరినీ కలిసి పని చేయండని చెప్పిన తర్వాత అధినేత మాటలను గౌరవించి ఇద్దరు కలిసిపోతారో, లేక గతంలో మాదిరే విభేదాలతో కాలం గడుపుతారో చూడాలి. అయితే ఇద్దరి నేతల మధ్య గొడవను సర్దిచెప్పటానికి సీఎం జగన్ తోలి అడుగు వేయటం గొప్ప పరిణామమే అని చెప్పాలి.