మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ..ఈ సారి..!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి రోజులు గడుస్తున్నప్పటికీ.. ఇంకా మెరుగయ్యే సూచనలు కనిపించడం లేదు. 137 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన వంశీ, అన్ని కేసుల్లో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అప్పటి నుంచి కొంత ఊపిరి పీల్చుకుంటారేమో అనుకున్నప్పటికీ పరిస్థితి మరోసారి వైపరీత్యంగా మారింది.

ఇప్పటికే జైలు జీవితం వల్ల వంశీ శరీరానికి పలు సమస్యలు వచ్చినట్టు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల పార్టీ వర్గాలు కూడా ఆందోళనకు గురయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి వల్లభనేని వంశీకి తీవ్రమైన అస్వస్థత రావడంతో వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

తాజా సమాచారం ప్రకారం వంశీకి శ్వాసతీసుకోవడం కూడా ఇబ్బందిగా మారిందని తెలిసింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వంశీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారని అందరూ అనుకున్నారు.

కానీ ఆయనను ఆరోగ్య సమస్యలు అడ్డంకిగా మారాయి. ఇకపై కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంటే తప్ప చక్కగా తేరుకోవడం కష్టమేనని డాక్టర్లు సూచిస్తున్నట్టు సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో వల్లభనేని వంశీ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులుప్రార్థనలు చేస్తున్నారు.