2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేవ్ మాములుగా కొనసాగలేదు. చాలా చోట్ల వైసీపీ తరపున పోటీ చేస్తున్న నాయకులు కూడా ప్రజలు తెలియదు కానీ జగన్ చెప్పిన మాటలను విని ప్రజలు వైసీపీ నాయకులను గెలిపించారు. అయితే జగన్ వేవ్ ఇంతలా కొనసాగుతున్న సమయంలో కూడా రాజమండ్రి, రూరల్ రాజమండి నియోజకవర్గాల్లో మాత్రం జగన్ తన హవాను కొనసాగించలేకపోతున్నారు. అయితే ఇప్పుడు జగన్ రెడ్డి ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ బలపరచడానికి జగన్ రెడ్డి ప్రత్యేకమైన వ్యూహం రచిస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
ఈ రెండు నియోజక వర్గాల్లో ప్రత్యేక వ్యూహం
రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్య ప్రకాష్ రావు ను కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పించి ఏపిఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రమణ్యానికి పగ్గాలు అప్పగించారు. రూరల్ లో ఆకుల వీర్రాజునే ఎన్నికల తరువాత కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ రెండు చోట్లా వీరిద్దరిపై అధినేత పెట్టుకున్నంత స్థాయిలో పార్టీ బలోపేతం కావడం లేదన్న నివేదికలతో అధిష్టానం మరోసారి ప్రయోగాలకు సిద్ధమౌతున్నట్లు పార్టీ వర్గాల్లో గట్టిగానే ప్రచారం సాగుతుంది. రాజమండ్రి అర్బన్ ఏరియాలో ఆకుల సత్యనారాయణకు అధిష్టానం ఎంపిక చేస్తుందంటున్నారు. ఇక రూరల్ లో అయితే పోటీ తీవ్రంగానే ఉంది. అక్కడ ఎంపి భరత్ రామ్ గ్రూప్ లోనే ఇద్దరు నేతలు కో ఆర్డినేటర్ కోసం వేచి చూస్తున్నారని చెబుతున్నారు.
టీడీపీని వైసీపీ ఎదురుకోగలదా!!
ఈ రెండు నియోజక వర్గాల్లో టీడీపీకి బాగా పట్టు ఉంది, అలాగే ఇక్కడ టీడీపీకి చాలా బలమైన నాయకులు ఉన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గట్టి పట్టున్న నేత. ప్రస్తుతం చంద్రబాబు పాలిట్ బ్యూరో పదవిని కూడా గోరంట్లకు ఇవ్వడంతో ఆయన మంచి దూకుడు మీదే ఉన్నారు. అలాగే అర్బన్ లో ఇప్పటికి ఆదిరెడ్డి భవాని కుటుంబానికి తిరుగులేదనే చెప్పాలి. భవాని మామ మాజీ ఎమ్యెల్సీ అప్పారావు భర్త శ్రీనివాస్ లకు అన్ని డివిజన్లలో బలమైన క్యాడర్ ఉంది. ఈ ఇద్దరు లీడర్లను సమర్ధంగా ఎదుర్కొని ఫ్యాన్ ను స్పీడ్ గా తిప్పే నాయకుల కోసం వైసీపీ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.