`ఈఎస్ స్కామ్` లో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంలో కోర్టులో సీఎం జగన్ కి కలిసొచ్చిందా? లేదంటే? పచ్చ మీడియా…పసుపు దళం పెద్ద రాద్ధాంతమే చేసేవారా? అంటే అవుననే తెలుస్తోంది. అచ్చెన్న కు నిన్న కరోనా వైరస్ సోకినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదీ ఆయన ఆసుపత్రిలో ఉండగా కరోనా సోకడం జరిగింది. అదే జైలు లో ఉండి కరోనా వచ్చి ఉంటే? అచ్చెన్నను ఏదో చేయాలని ప్రభుత్వం ఇలా వైరస్ అంటించి చేసిందని ఆరోపించడానికి ఆస్కారం ఉండేది. కానీ పసుపు నేతలకు ఇప్పుడా ఛాన్స్ లేకుండా పోయింది.
గత నెలలో హైకోర్టు ఆదేశాల మేరకు అచ్చెన్న రమేష్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. పైల్స్ తో బాధపడుతో న్న అచ్చెన్నకు ఇంకా చికిత్స అవసరమని, అప్పటికే రెండుసార్లు ఆపరేషన్లు చేసారని వాదనలు వినిపించడంతో కోర్టు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ప్రకారమే అచ్చెన్న రమేష్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యం పొందుతున్నారు. ఇంతలో నిన్న జలుబుతో బాధపడటం..వెంటనే కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ అని రావడం జరిగింది. ప్రస్తుతం అచ్చెన్నకు కరోనాకు సంబంధించిన వైద్యం కూడా అదే ఆసుపత్రిలో అందిస్తున్నారు. ఆరోగ్యం బాగానే ఉంది.
ఈ నేపథ్యంలో వైకాపా సేఫ్ జోన్ లో పడింది. లేదంటే ఈపాటికే టీడీపీ నేతలంతా కట్టగట్టుకుని జగన్ ప్రభుత్వం మీదకు వచ్చేవారు. ఇప్పటికే టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తారని పసుపు నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. హైకోర్టులు..సుప్రీంకోర్టులు…సవాళ్లు…ప్రతిసవాళ్లు అంటూ తిరుగుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో అచ్చెన్నకు ఏం జరిగినా సర్కార్ కి మరోసారి తిప్పలు తప్పేవి కాదు.