జగన్ సర్కార్ సిద్ధమే.. ఆ బాధ్యత టీడీపీ తీసుకుంటుందా.?

Jagan Govt Ready To Release 1600 Cr for Vaccine

Jagan Govt Ready To Release 1600 Cr for Vaccine

‘మీకు చేతకాకపోతే అధికారంలోంచి దిగిపోండి.. మేం కరోనా భూతాన్ని అదుపులోకి తెచ్చి చూపిస్తాం..’ అంటూ అధికార వైసీపీకి సవాల్ విసురుతోంది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోంచి దిగిపోతారా.? అని గోతికాడ నక్కలా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎదురుచూస్తున్నారని వైసీపీ ఆరోపించడం కొత్తేమీ కాదు. వ్యాక్సిన్ల విషయంలో టీడీపీ చేస్తున్న ఓవరాక్షన్ విషయమై, మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా కేంద్రం ఆధీనంలో వుంది. రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సింది కేంద్రమే. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం అనుమతితో, వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ఆర్డర్ కూడా పెట్టాం. దానికి కేంద్రం నుంచి ఆమోద ముద్ర పడాల్సి వుంది.. ఒకవేళ టీడీపీ గనుక ఏదన్నా వ్యాక్సిన్ తయారీ సంస్థను ఒప్పించగలిగితే, రాష్ట్ర ప్రభుత్వం.. టీడీపీ చెప్పిన కంపెనీకి 1600 కోట్లు వెంటనే చెల్లించడానికి సిద్ధంగా వుంది. ఆ సత్తా టీడీపీకి వుందా.?’ అని సవాల్ విసిరారు మంత్రి కొడాలి నాని.

నిజానికి, ఈ సవాల్ ఇంతలా కొడాలి నాని విసరడంలో బలమైన కారణమే వుంది. కానీ, ఇది సందర్భం కానే కాదు. విపక్షాలు ఆ బాధ్యత తీసుకుంటే, వైసీపీ అధికారంలో వుండడం ఎందుకు.? గతంలో కూడా పలు సందర్భాల్లో ప్రతిపక్షానికి సవాల్ విసురుతూ ఈ తరహా వ్యాఖ్యలు పలువురు మంత్రులు చేశారు. వ్యాక్సినేషన్ విషయమై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వ్యాక్సిన్ కొరత రాష్ట్రంలో వుందన్నది నిర్వివాదాంశం. ఆయా సంస్థలతో ఇప్పటికే చర్చించామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎక్కడ సమస్య వస్తోందో కూడా ప్రజలకు వివరించాలి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ సామర్థ్యానికి తగ్గట్టు పనిచేస్తున్నాయా.? లేదా.? అన్నది తేల్చాల్సింది కేంద్రమే. ఆ కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇక, జాతీయ స్థాయిలో తనకు చాలా పెద్ద పరిచయాలున్నాయని చెప్పుకునే చంద్రబాబు, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడమో, బతిమాలడమో చేయడం ద్వారా మాజీ ముఖ్యమంత్రిగా తన హుందాతనాన్ని నిలబెట్టుకుంటే మంచిదే మరి.