ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ పదవుల వ్యవహారం పై, అధికార వైసీపీ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాసనమండలిలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ పదవుల పై కొద్ది రోజులుగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఈ నాలుగు స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం, మరోవైపు గవర్నర్ కోటాలో శాసన మండలికి ఎంపికైన ఇద్దరు సభ్యుల పదవీ కాలం ముగియడంతో, అధికార పార్టీ వాటిని భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
ఇక ఈ ఎమ్మెల్సీ రేసులు అవకాశం ఎవరికి దక్కుతుందనే పెద్ద చర్చగా మారింది. అయితే ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీ పేర్లను ఖారారు చేశారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ఎమ్మెల్సీలుగా ఎస్సీ సామాజికవర్గం నుండి మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు, మైనారిటీ కోటాలో కడప జిల్లాకు చెందిన జకియా ఖానుం పేర్లను ఫైనల్ చేసారని తెలుస్తోంది. ఇక వీరి పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరి చివరి నిముషంలో ఏమైనా ట్విస్టులు ఉంటాయా అనేది చూడాల్సి ఉంది.