సచివాలయం ‘జీ బ్లాక్’ కింద గుప్త నిధులు లేనట్టేనా?

తెలంగాణ సచివాలయ భవనాన్ని కూల్చేందుకు తొలుత నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురైనా తాజాగా కూల్చివేతకు సంబంధించిన అడ్డంకులు తొలిగిపోయాయి. కూల్చివేత పనులు ప్రారంభించవచ్చు అని హైకోర్ట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌లన్నీ న్యాయస్థానం కొట్టిపారేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఇప్పటికే కూల్చివేత పనులు 50 శాతం పూర్తికాగా మిగిలిన పనులను కూడా పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యింది.

అయితే సచివాలయ కూల్చివేతకు అన్ని అడ్డంకులు తొలగినా కొన్ని అనుమానాలు మాత్రం అంతు చిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. సచివాలయంలోని జీ బ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దీనిపై కొన్ని అనుమానాలు కూడా లేవనెత్తారు. సచివాలయంలోని జీ బ్లాక్‌కు ఎంతో విశిష్టత ఉందని, 1888లో ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ నిర్మించిన ఆ భవంతి కింద నేలమాళిగలు ఉన్నాయని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించిందని, వాటి అన్వేషణ కోసం అనుమతి కోరగా అప్పట్లో కేసీఆర్ సర్కార్ నిరాకరించిందని గుర్తు చేస్తూ జీ బ్లాక్‌ ఉన్న స్థలాన్ని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించి, పరిశోధన సాగించాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే గుప్తనిధుల అంశంపై స్పందించిన నిజాం వారసుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడైన ‘నవాబ్ నజఫ్ అలీ ఖాన్’ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముస్లిం రాజులెవరికి నేలమాళిగల్లో నిధులు దాచే అలవాటు ఉండదని, భూమి తప్ప ఇతర ఆస్తులు కూడబెట్టడం మహా పాపమని ఖురాన్‌లో స్పష్టంగా రాసి ఉంటుందని అన్నారు. అయితే తమ తాతగారు వేసవి విడిదికోసం మాత్రమే ఆ భవనాన్ని కట్టించారని, అక్కడికి వెళ్ళిన మొదటిరోజే తొండ ఎదురుకావడంతో అపశకునంగా భావించి మళ్ళీ ఎప్పుడూ అక్కడకు వెళ్ళలేదని తెలిపాడు. ఆ తరువాత ఆ భవంతి సచివాలయంగా మారిందని అన్నారు.