తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.! దళిత ముఖ్యమంత్రి ఎక్కడ.?

మళ్ళీ అదే ప్రస్తావన.! ఇంకోసారి గట్టిగా వస్తోంది. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడేని తెలంగాణ ఉద్యమ సమయంలో పదే పదే నినదించారు అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి తెలంగాణ అనే పేరు మాయమైపోయింది. వెంటనే కాదు లెండి.. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత.! ఎలాగైతేనేం, అవసరం తీరాక ముఖ్యమంత్రి పదవి దళితుడికి ఇస్తానన్న మాట తప్పిన కేసీయార్, తన పార్టీ నుంచి తెలంగాణ పేరునీ పీకి పారేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తొమ్మిదేళ్ళు పూర్తయ్యింది. పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న దరిమిలా, అంగ రంగ వైభవంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేస్తున్నారు.

ఈ తొమ్మిదేళ్ళలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ అసలు సచివాలయానికే వెళ్ళింది లేదు. ఈ మధ్యనే కొత్తగా సచివాలయాన్ని నిర్మించి.. అందులోకి అడుగు పెట్టారు. అంతకు ముందు వాస్తు భయంతో ఆ సచివాలయానికి దూరంగా వున్నారు. ఆ వాస్తు భయంతోనే పాత సచివాలయాన్ని కూల్చేశారు.

ఇలా వుంటుంది కేసీయార్‌తోని. అయినాగానీ, ఆయనే తెలంగాణ పిత.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ముచ్చటగా మూడోసారి కేసీయార్ అధికారంలోకి వస్తారా.? పొలిటికల్ ఈక్వేషన్స్ అలాగే వున్నాయ్. తేడా వస్తే మాత్రం, ‘దళితుడే ముఖ్యమంత్రి’ అని కేసీయార్ పాత పల్లవిని అందుకున్నా ఆశ్చర్యమేమీ లేదు.