భూసర్వే వెనుక పెద్ద కుట్ర దాగిఉందా..? సమాధానాలు లేని సందేహాలు

ap land

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే దీని ముఖ్య ఉద్దేశ్యం పేదల వాడుకుంటున్న భూములను ప్రభుత్వం లాక్కోవటమే అని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అసలు సమస్య భూమిపై హక్కులు లేకుండా లక్షలాది పేదలు పోరంబోకు భూములు, ఇనాం భూములు సాగు చేసుకుని జీవిస్తున్నారు. వీరు సాగు చేసుకునే భూమికి సంబంధించి ఎలాంటి పట్టాలు ఉండవు. ఐదారు దశాబ్ధాలుగా పేదలు కొండ పోరంబోకు, డొంక భూములు, చెరువు శిఖం భూములు, ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, కాలువగట్టు భూములు ఇలా అనేక రకాల భూముల సాగు చేసుకుంటున్నారు. ఇప్పటికీ వీటిపై పేదలకు హక్కులు లేవు. ఎలాంటి పత్రాలు లేవు. రీ సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం పేదలు సాగు చేసుకుంటున్న భూమికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని ఎక్కడా చెప్పలేదు. దీంతో లక్షల మంది పేదలు ఆందోళన చెందుతున్నారు.

ap land

 నిజానికి ఈ భూ సర్వే వలన ఉన్న భూ సమస్యలు తగ్గకపోగా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సర్వహక్కులు ఉన్న భూ యజమానికి శాశ్వత భూ హక్కు కల్పిస్తామని సీఎం ప్రకటించడం విడ్డూరంగా ఉందని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. అంటే ఇప్పటి దాకా భూ యజమానులకు వారి భూములపై హక్కు లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. రీసర్వే పేరుతో రూ.2600 కోట్లు దోపిడీకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. తాజా రీసర్వే ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు సృష్టించి భూ యజమానుల మధ్య గొడవలు పెట్టేలా ఉన్నాయని వామపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.

 ఎన్నో దశాబ్ధాలుగా వారసత్వంగా భూములను అనుభవిస్తున్నా వాటికి పట్టాలు లేని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి భూములకు హక్కు కల్పించకపోగా, ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించే ప్రమాదం ఉందని అనుభవదారులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఒక భూమిని వరుసగా 13 సంవత్సరాల పాటు అనుభవిస్తే ఆ భూమి అతనికే చెందుతుందని చట్టాలు చెబుతున్నాయి. కానీ లక్షల మంది పేదలు దశాబ్ధాలుగా పోరంబోకు భూములు సాగు చేసుకుంటున్నా…వాటిని రికార్డుల్లో నమోదు చేయలేదు.

 తాజాగా ప్రారంభించిన రీ సర్వే ద్వారా అలాంటి వారు భూములు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైనా భూమి విషయంలో గొడవలు ఉన్నా, హక్కులపై సమస్యలుంటే పరిష్కరించాలి కాని ఇలా ఎలాంటి గొడవలు లేని భూముల కొలతలు వేయడం అంటే వైసీపీ పెద్దలు మిగులు భూములను వెలికితీసి కాజేసే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.