వెంకన్న స్వామి అస్తులు అమ్మకంపై ప్రతిపక్షాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ప్రజలు సహా అంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి పరిశీలన మాత్రమే చేస్తున్నామని, ఎలాంటి అమ్మకాలు జరగలేదని, జరబోమని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలో పొలిటికల్ సీన్ కాస్త చల్లారినట్లైంది. అయితే తిరుపతి దేవస్థానం ఆస్తులను అమ్మాలని నిర్ణయించింది తమ ప్రభుత్వం కాదని, టీడీపీ అదికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వ నిర్వాకం అని మంత్రి వెల్లంపల్లి సురేష్ అన్నారు. అప్పటి సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని, చిన్న చిన్న ఆస్తులు నిరర్ధకంగా ఉంటే ఎలాంటి ఉపయోగం లేదని, ఆ నివేదికను ఇప్పటి పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు.
ఆస్తుల విక్రయం వలన టీడీకి ఉపయోగం ఉంటేనే ముందుకెళ్తామని, నష్టం కలిగించే ఎలాంటి నిర్ణయం తీసుకోమని మంత్రి స్పష్టం చేసారు. దీనిపై ప్రతిపక్షాలు కేవలం రాజకీయం చేయడం కోసమే అర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు. ఆలయాలపై తమకున్న చిత్తశుద్ది ఏ ప్రభుత్వానికి లేదన్నారు. టీటీడీ ఆస్తుల అమ్మకం అన్నది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, గతంలో టీటీడీ చైర్మెన్ గా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి ఒక కమిటీ వేసారని ఆ కమిటీ నిర్ణయం ప్రకారమే తాము ముందుకెళ్లాం తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. 1974 నుంచే టీటీడీ భూములను వేలం ద్వారా విక్రయిస్తున్నారన్నారు.
ఇప్పటివరకూ దాదాపు 142 ఆస్తులను విక్రయించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ టీటీడీ భూములను వేలం వేశారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడం ప్రతిపక్షాలకు ఇష్టం లేక లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షం ఎంత యాగి చేసినా పట్టించుకోమని, ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల్లో భాగంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుకెళ్తామని స్పష్టం చేసారు.