తేదాపా పార్టీకి చెందిన ఓ ఐదారుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగి ప్యాన్ కిందకి వస్తున్నట్లు రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. వైకాపా అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న టార్గెట్ పెద్ద స్కెచ్ వేసి ఫిరాయింపులకు పాల్పడుతోందని చంద్రబాబు కంటి మీద కునుక లేకుండా కథనాలు వేడెక్కించాయి. జగన్ ఆకర్ష్ ఆపరేషన్ దెబ్బకి తేదాపా కుదేలవ్వడం ఖాయమని…ఇక పార్టీ గాల్లో కలిసి పోయినట్లేనని వెబ్ సహా ప్రింట్ మీడియా బలమైన కథనాలు ప్రచురించింది. చంద్రబాబుకు బాకా కొట్టే పచ్చ మీడియా కూడా పదే పదే ఇలాంటి కథనాలను జోరుగా ప్రచారం చేసింది.
దీంతో రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ గందరగోళం నెలకొంది. మూలిగే నక్కపై తాటి పండు పడ్టట్లు కొత్తగా ఇదేం సమస్య టీడీపీ శ్రేణులు తలలు పట్టుకున్నారు. అయితే తాజాగా దీనిపై టీడీపీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ప్రకాశం జిల్లా పర్చూరు తేదాపా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తాను ఏ పార్టీలోకి మారడం లేదని తెలిపారు. పార్టీ మార్పుపై ఎవరితోనూ చర్చించలే దని, పార్టీ మారే ఉద్దేశం కూడా లేదని కుండ బద్దలు కొట్టేసారు. కొందరు కావాలనే తనపై దుష్ప ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం తేదాపాలోనే కొనసాగుతునానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఓ ఆసక్తికర సంగతి వెలుగులోకి వచ్చింది.
వైకాపా మంత్రి బాలినేని శ్రినివాస రెడ్డి తో జరిపిన చర్చలు సఫలం కాని నేపథ్యంలో సాంబశివరావు యూ టర్న్ తీసుకున్నారని అంటున్నారు. అంతకు ముందు పలువురు టీడీపీ సీనియర్ నేతలతోనూ సాంబశివరావు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తనకు కావాల్సినవన్నీ అదిష్టానం ఏర్పాటు చేస్తుందని…ఆవిషయంలో బెంగ పడాల్సిన పనేంలేదని అదిష్టానం మాటిచ్చినట్లు వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు జంపింగ్ రూమార్ రాగానే అధినేత చంద్రబాబు నాయుడు డౌట్ ఉన్న ఎమ్మెల్యేలతో హుటాహుటిన ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఒక్కో ఏమ్మెల్యేకు 50 కోట్లు ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగింది. సాంబ శివరావు కూడా అక్కడే లాక్ అయినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.