KCR govt : ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అప్పటి గవర్నర్ నరసింహన్ చాలా యాక్టివ్‌గా వుండేవారు. గవర్నర్ అంటే, ‘పేపర్ వెయిట్ మాత్రమే..’ అని అంతకు ముందు వరకూ వున్న చెడ్డ పేరుని ఆయన తొలగించేశారు. గవర్నర్ పదవికి ఆయన వన్నెతెచ్చారన్నది నిర్వివాదాంశం.
రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ఎప్పటికప్పుడు ఆయన కేంద్రానికి నివేదించారు. అలా చాలా రాజకీయ పార్టీల నుంచి ఆయన కొంత వ్యతిరేకతను కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది.
మాజీ గవర్నర్ నరసింహన్ గురించిన ప్రస్తావన ఇప్పుడెందుకంటే, ఆ పేరుని తెలంగాణ మంత్రి కేటీయార్ ప్రస్తావించారు గనుక. ‘నరసింహన్‌తో మాకెలాంటి ఇబ్బందులూ రాలేదు.. మేమెందుకు ప్రస్తుత గవర్నర్ మీద అసహనంతో వుంటాం.? ఆమెతో మాకు పంచాయితీ ఏమీ లేదు.. ఆమెను మేం తక్కువగా చూడటంలేదు..’ అని కేటీయార్ చెప్పుకొచ్చారు.
అయితే, తమిళసై తెలంగాణ గవర్నర్‌గా వచ్చినప్పటినుంచీ.. తెలంగాణ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు షురూ అయ్యాయి. మొదట్లో తెలంగాణ గవర్నర్ తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య సంబంధాలు బాగానే వుండేవి.
క్రమంగా వ్యవహారం తేడా కొట్టింది. మేడారం జాతర సమయంలో గవర్నర్ విషయమై తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదన్న విమర్శలున్నాయి.
మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారు. అంతకు ముందు కౌశిక్ రెడ్డికి గవర్న్ కోటా ఎమ్మెల్సీ పదవి కోసం తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేస్తే, గవర్నర్ తమిళి సై తిరస్కరించారు.
వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది.
ఢిల్లీకి తాజాగా వెళ్ళిన తమిళిసై, తెలంగాణ ప్రభుత్వంపై ఆసక్తికరమైన, సంచలనమైన వ్యాఖ్యలే చేశారు. తనను అవమానిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోపక్క కేంద్రానికి గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారనీ ప్రచారం జరుగుతోంది. ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది.? ఏమైనా అవ్వొచ్చు. గవర్నర్ పదవి అంటే పేపర్ వెయిట్ కాదు సుమీ.!