ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఈ రోజే పోలింగ్ జరిగింది. కానీ, ఏపీకీ.. తెలంగాణకీ చాలా తేడా వుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక అత్యంత ప్రశాంతంగా ముగిసింది. కానీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనే ఉప ఎన్నిక అత్యంత జుగుప్సాకరంగా జరిగింది. ఓటరు, తన భర్త పేరు చెప్పుకోలేకపోవడమేంటి.? తన తండ్రి పేరు చెప్పుకోడానికి భయపడటమేంటి.? ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో ఏనాడైనా ఇలాంటి పరిస్థితి కనిపించిందా.? బస్సుల్లో దొంగ ఓటర్లను ఓ ఉద్యమంలా తరలించడమంటే, అది అస్సలేమాత్రం క్షమార్హం కాదు.
అసలు సిసలు ఓటర్లు ఓట్లేయలేని పరిస్థితి రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విపక్షాలన్నీ, తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఇది సాధ్యమయ్యే పనేనా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మొత్తం అరాచకాలకు సంబంధించిన అన్ని వీడియోలూ సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ అందుబాటులోనే వున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం గనుక సరిగ్గా, లోతుగా పరిస్థితుల్ని అధ్యయనం చేస్తే, తిరుపతి ఉప ఎన్నిక రద్దయ్యే అవకాశాలే వున్నాయన్నది వైఎస్సర్సీపీయేతర పార్టీల వాదన. అయితే, అధికార పార్టీ వెర్షన్ ఇంకోలా వుంది. ఈ అక్రమాలతో తమకు సంబంధం లేదని చెబుతోంది. విపక్షాలన్నీ ఒకే మాట మీద నిలబడి, తమ మీద బురద చల్లుతున్నాయని అధికార వైసీపీ అంటోంది. ఏదిఏమైనా, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి జరిగిన అరాచకాలపై నిజాలు నిగ్గు తేలాల్సి వుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేస్తున్న దరిమిలా.. అటు వైపు నుంచి స్పందన ఎలా వస్తుందన్నది వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం.. తిరుపతి ఉప ఎన్నిక చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయం, తిరుపతి ఇమేజ్ దెబ్బతీసేలా వుంది. అంతే కాదు, ఆంధ్రపదేశ్ పరువు కూడా జాతీయ స్థాయిలో పోతోంది. దేశమంతా ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన అక్రమాలు అరాచకాల గురించే చర్చించుకుంటుండడం బాధాకరం.