చంద్ర‌బాబు ఛ‌రిష్మా జ‌గ‌న్ బ్రాండ్ ముందు సాధ్య‌మేనా?

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఇంకా వృద్ధాప్యంలోకి రాలేదనుకుంటారు. కానీ వ‌చ్చేసారు. ఎందుకంటే ఆయ‌న వ‌య‌సు ఇప్పుడు 70 ఏళ్లు. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం త‌క్కువ వ‌య‌సులోనే ప్రారంభ‌మైంది. 28 ఏళ్ల వ‌య‌సులోనే కాంగ్రెస్ త‌రుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గా గెలిచారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు రాజ‌కీయాల‌లో అంచ‌లంచెలుగా ఎదిగిన వైనం గురించి తెలిసిందే. మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా, కొత్త‌గా ఏర్పాటైన‌ అవిభాజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ తొలి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు స్థానం ప్ర‌త్యేక‌మైన‌ది. నాలుగు ద‌శాబ్ధాల రాజ‌కీయ అనుభ‌వంలో ఆరితేరిన ఘ‌నుడు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని సంపాదించుకున్న నాయ‌కుడు.

రాజ‌కీయాన్ని శాషించ‌గ‌ల నాయ‌కుడిగా చంద్ర‌బాబుకి మంచి పేరుంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న ముగిసినా..ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చినా చంద్ర‌బాబు బ్రాండ్ ఇమేజ్ కి వ‌చ్చిన న‌ష్ట‌మైతే లేదు. అయితే వైఎస్ త‌న‌యుడిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకు సాక్ష్యమే 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు. 175 స్థానాల‌కు గాను 151 సీట్లు గెలుచుకుని వైకాపా గెలుపుబావుటా ఎగ‌ర‌వేసింది. ఇక చంద్ర‌బాబు 23 సీట్లు గెలుచుకుని ప్ర‌తిప‌క్ష హోదాని నిల‌బెట్టుకున్నారు. ఆ విష‌యం ప‌క్క‌న‌బెడితే!

ఇంకా రాజ‌కీయాల‌లో చంద్ర‌బాబు ఛ‌రిష్మా ఇంకెన్నాళ్లు ఉంటుంది? ఆయ‌న‌కు ఇంకా రాజ‌కీయ భ‌విష్య‌త్ ఎన్నాళ్లు ఉంది? అన్న ప్ర‌శ్నల‌ని రెయిజ్ చేసారు సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కులు ఒక‌రు. అందుకు ఆయ‌న స‌మాధానం ఏంటంటే? ఎలా లేద‌న్న చంద్ర‌బాబు ఇంకా ప‌దేళ్ల పాటు పాలిటిక్స్ లో యాక్టివ్ గా అయితే కొన‌సాగగ‌ల‌ర‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఆరోగ్య ప‌రంగా చంద్ర‌బాబుకి ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు. పార్టీ ప్ర‌చారం కోసం మ‌రీ అతిగా బ‌య‌ట తిర‌గ‌క‌పోయినా ఆయ‌న వ్య‌వ‌హ‌రాల‌న్నింటిని ఒక ద‌గ్గ‌ర కూర్చొని డీల్ చేయ‌గ‌ల‌రన్నారు. అందుకు స‌రైన టీమ్ ఉంటే చంద్ర‌బాబు ఈజీగా ముందుకు న‌డిపించ‌గ‌ల‌డ‌ని అన్నారు.

మ‌రి చంద్ర‌బాబుకి ఉన్న ఆ బ్రాండ్ జ‌గ‌న్ బ్రాండ్ ఇమేజ్ ముందు ప‌నిచేస్తుందా? అంటే కష్ట‌మ‌నే సందేహం వ్య‌క్తం చేసారు. ఎవ‌రి బ్రాండ్ ఇమేజ్ వారిది. కానీ జ‌గ‌న్ ఇమేజ్ ముందు చంద్ర‌బాబు ఛ‌రిష్మా అంత ఈజీ కాద‌న్నారు. ఏ నాయ‌కుడినైనా ప్ర‌జ‌లు ఎక్కువ‌సార్లు చూసినా బోర్ ఫీల్ అవ‌కాశం లేక‌పోలేదు క‌దా అన్నారు. ఇటీవ‌ల టీడీపీ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు అరెస్ట్ అయిన‌ప్పుడు ఆ జిల్లా వాసులు సంతోషంగానే ఫీలైన‌ట్లు ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. క్యాడ‌ర్ విష‌యంలోనూ అదే జ‌రుగుతుంద‌న్నారు. వ‌య‌సు రీత్యా ఇద్ద‌రి మ‌ధ్య చాలా తేడా ఉంది. జ‌గ‌న్ ఏ ప్ర‌చార కార్య‌క్ర‌మానికైనా ఎక్క‌డికైనా హాజ‌రు కాగ‌ల‌రు. కానీ చంద్ర‌బాబు ఆ చ‌లాకీత‌నంతో ఇప్పుడ‌లా తిర‌గ‌లేరు. కానీ చంద్ర‌బాబు ఎన్టీఆర్ బొమ్మ‌తో..చంద్ర‌బాబు చ‌రిష్మాతో కొన్ని సీట్లు అయితే క‌చ్చితంగా గెలుచుకుంటార‌ని తెలిపారు.