కరోనా వైరస్ మూడో వేవ్ అతి త్వరలో రాబోతోంది. దాన్నుంచి తప్పించుకోవడానికి అవకాశమే లేదని పలువురు వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆగస్ట్ తర్వాత ఏ క్షణమైనా కరోనా మూడో వేవ్ దేశాన్ని కమ్మేయొచ్చన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాగా, గత నెల.. అంటే మే నెలలోనే కరోనా మూడో వేవ్ మొదలైపోయిందంటూ మహారాష్ట్రలో ఎక్కువమంది చిన్నారులు కరోనా బారిన పడడం గురించిన అధ్యయనాలు వెలుగు చూస్తున్నాయి. మొదటి వేవ్.. అంటే, 50 ఏళ్ళ వయసు పైబడిన వారి గురించి.. అన్న చర్చ జరిగింది.
రెండో వేవ్ అంటే, 18 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసువారికి కరోనా సోకడం, తీవ్రంగా బాధపెట్టడం.. అని వర్గీకరించారు. మూడో వేవ్.. 18 ఏళ్ళ దిగువన వయసున్నవారికి.. అంటున్నారు. అయితే, చిన్నారులకు కరోనా సోకడం – మూడో వేవ్ గురించి భయాందోళనలు అవసరం లేదని అధికారంలో వున్న పార్టీలకు చెందిన నేతలు చెబుతుండడం గమనార్హం. నిజానికి, కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోవడం అనేది తక్కువ శాతం మందిలోనే కనిపిస్తున్నా, అంతకు మించి సామాజిక, ఆర్థిక విధ్వంసం జరుగుతోంది.
కరోనా నుంచి కోలుకున్నవారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కొద్ది రోజుల తర్వాత అనూహ్యంగా మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువే. అవి కరోనా మరణాల కిందికి రావడంలేదు. కరోనా సోకి, ఆసుపత్రుల్లోనో, ఇంటి వద్దనో చికిత్స పొందినవారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి మొదటి, రెండో వేవ్స్ సందర్భంగా.
మొదటి దెబ్బ, అంతకు మించి రెండో దెబ్బ.. ఇప్పుడిక మూడో దెబ్బ.. అంటే, ఆ వైరస్ వ్యాప్తి మొదలైతే, మానసిక ఆందోళనతో ప్రాణాలు కోల్పోయేవారే ఎక్కువ వుండొచ్చు. వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుకున్నంత జోరుగా సాగకపోవడం చూస్తోంటే, భవిష్యత్ భయానకం అన్న బావన కలగకమానదు.