వీడీయో లీక్ రగడ: ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారా.? లేదా.?

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార వైసీపీ, తమ ఎంపీకీ ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చేసింది. చంద్రబాబు అండ్ యెల్లో గ్యాంగ్ దుష్ప్రచారమంటూ దుమ్మెత్తిపోస్తోంది. ప్రభుత్వం తరఫున కూడా, ఎంపీ గోరంట్ల మాధవ్‌కి క్లీన్ చిట్ లభించేసినట్టే.!

ఇంతకీ, ఈ వివాదానికి సంబంధించి ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారా.? లేదా.? గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేసినట్లుగా హోంమంత్రి చెబితే, అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మాత్రం ఆయన ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని చెప్పారు. మరోపక్క, తాను ఫిర్యాదు చేసినట్లు గతంలోనే గోరంట్ల మాధవ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ, ఇందులో ఏది నిజం.?

వ్యవహారం అమెరికా వరకూ వెళ్ళింది. అమెరికాలోని ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో గోరంట్ల మాధవ్ వీడియో పరీక్షించబడింది. సరే, దాని ఫలితంపై టీడీపీ – వైపీపీ మధ్య యాగీ జరుగుతోందనుకోండి.. అది వేరే సంగతి. ఇందులోకి ఏపీ సీఐడీ ఎలా ఎంట్రీ ఇచ్చినట్లు.? ఎవరి ఫిర్యాదు మేరకు అయినా ఏపీ సీఐడీ విచారణ జరుపుతోందా.? ఇది మళ్ళీ ఇంకో ప్రశ్న.

ఐటీ యాక్టుని ఉల్లంఘించినవారిపై చర్యలంటూ ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ హెచ్చరించడం చూశాం. అంటే, టీడీపీ అలాగే జనసేనకు చెందినవారిపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేయబోతోందన్నమాట. వీడియో కాల్ నిజమైనదా.? కాదా.? అన్నది తేల్చడం దాదాపుగా అసాధ్యమని స్పష్టమైపోయింది. సో, అసలు వివాదం పక్కకు వెళ్ళి, ఇప్పుడు అనవసర అరెస్టులు తెరపైకి రాబోతున్నాయన్నమాట.

గోరంట్ల మాధవ్ ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదంటూ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ విషయమై తాపు సంబంధిత విభాగాలకు ఫిర్యాదు చేసినట్లు టీడీపీ మహిళా నేతలు చెబుతున్నారు. మరి, ప్రభుత్వం ఈ ఫిర్యాదులపై ఎందుకు స్పందించడంలేదు.? అన్నదానిపై భిన్న వాదనలు వున్నాయి.
ఎవరి గోల వారిదే.! రాష్ట్రంలో ఇంకే సమస్యా లేదన్నట్టు, ఈ ఒక్క వివాదంపైనే మొత్తం రాజకీయం, ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది.