చంద్రబాబు నాయుడుగారి రాజకీయమే వేరే విధంగా ఉంటుంది. ఏ దశలో అయినా పొత్తులకు సై అనడం బాబుగారి ప్రత్యేకత. కలిసినడిచే పార్టీలు ఉండాలే కానీ ఒకటేమిటి మూడు నాలుగు పార్టీలను పక్కనే పెట్టేసుకుంటారు. ఇక అవసరం గడిచాక దోస్తులను ఆయన ఎలా ట్రీట్ చేస్తారో చెప్పాల్సిన పనే లేదు. ఆయన వైఖరి జనసేన, బీజేపీలకు బాగా తెలుసు. అందుకే పొత్తు పెట్టుకుందాం రండి అంటూ బాబుగారు ఆహ్వానాలు ఇస్తున్నా ఎవ్వరూ కన్నెత్తి కూడ చూడట్లేదు. అయినా చంద్రబాబులో ఆశ చావలేదు. బీజేపీని గిల్లుతూనే ఉన్నారు. పాపం.. అయన అవసరం అలాంటిది మరి. ఇంతకుముందులా రాజకీయ క్షేత్రంలో ఆయన మాట చెల్లుబాటు కావట్లేదు. అయన్ను ఎవ్వరూ పెద్దగా కేర్ చేయట్లేదు. బిలీవ్ అంతకన్నా చేయట్లేదు.
అయినా పరిస్థితులు మారకపోతాయా.. బీజేపీ, జనసేనలతో కలిసి కూటమి కట్టలేకపోతామా అని ఆశపడుతున్నారు. సరే ఆయన ఆశిస్తున్నట్టే బీజేపీ, జనసేనలు పొత్తుకు అంగీకరిస్తే బాబుగారు ఒక పెద్ద త్యాగం చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. అదే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం. అవును.. బీజేపీ, జనసేనలు పొత్తుకు ఒప్పుకుంటే బాబు ముండుఈ డిమాండ్ పెట్టే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఏదో పోటీ చేశాం అంటే చేశాం అన్నట్టు కాకుండా ఈసారి గట్టిగా పోరాడి ప్రతిపక్ష హోదాలో అయినా కూర్చోవాలని అనుకుంటున్నాయి. అసలు వీలైతే అదికార పీఠాన్నే కొట్టాలనే ఊపులో ఉన్నాయి.
పైగా జనసేన అధ్యక్షుడు పవన్ గత ఎన్నికల్లో తన పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. తనను తాను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈసారి కూడ బీజేపీ, జనసేన కూటమి తరపున ఆయనే సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలనే ప్రతిపాదన ఉంది. ఇక జనసైనికులు అయితే పవన్ సీఎం అయి తీరాలని పట్టుబడుతున్నారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడొచ్చినా పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉండాల్సిందే. అది ఒంటరిగా అయినా కావొచ్చు, పొత్తుల్లో అయినా కావొచ్చు. అలా కాకుండా పవన్ కేవలం సపోర్ట్ చేస్తూ నిలబడిపోతే జనసేన మళ్లీ మొదటికే వస్తుంది. అందుకే ఈసారి బీజేపీ, జనసేన కూటమి నుండి ఆయనే సీఎం అభ్యర్థి అనే వాదన బలంగా వినిపిస్తోంది. కాబట్టి బీజేపీ, జనసేన కూటమితో కలవాలి అనుకుంటే చంద్రబాబు తాను తప్పుకుని కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను బలపర్చాల్సి ఉంటుంది. లేకుంటే అధికారాన్ని పంచుకునే ఒప్పందమైనా చేసుకోవాల్సి ఉంటుంది.