నందమూరి బాలకృష్ణ అల్లుడు, గీతం విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ భరత్ గత ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖపట్నం ఎంపీ స్థానానికి బరిలో దిగారు. కానీ వైసీపీ హవా ముందు నెగ్గలేకపోయారు. వైసీపీ అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఖచ్చితంగా శ్రీ భరత్ గెలుస్తారని అంతా అనుకున్నారు. ఆర్థికంగా, సామాజికంగా శ్రీ భరత్ బలమైన వ్యక్తి. ఆయన కుటుంబ నేపథ్యం కూడ గొప్పదే. మొదటిసారి ఎన్నికల్లో నిలబడిన ఆయన గెలవాల్సిందేనని ఆశపడ్డారు. కానీ ఓటమిపాలయ్యారు. దీంతో అయన బాగా నిరుత్సాపడినట్టు ఉన్నారు. అందుకే పెద్దగా పార్టీ కార్యకలాపాల్లో కూడ కనిపించడంలేదు. రాబోయే 2024 ఎన్నికల్లో అయినా గెలవాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే సొంత ఆలోచన చేశారు.
ఈసారి ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. అది కూడ భీమిలి నియోజకవర్గం నుండే బరిలోకి దిగాలని ఆయన గట్టిగా అనుకుంటున్నారట. భీమిలిలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. 2014లో ఇక్కడి నుండి టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు గెలిపొందారు. ఆయన హయాంలో భీమిలిలో టీడీపీ బాగా బలపడింది. అందుకే గత ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థిగా సబ్బం హరిని చివరి నిముషంలో ప్రకటించినా బాగానే ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ కేవలం 9000 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. పైగా అక్కడ టీడీపీ తరపున పెద్దగా ప్రచారం కూడ జరగలేదు. ఇంకాస్త బలమైన క్యాండిడెట్ గనుక ఉండి ఉంటే టీడీపీ తప్పకుండా గెలిచి ఉండేది.
అందుకే ఆ స్థానం నుండి పోటీచేస్తే తప్పకుండా గెలుస్తామని శ్రీ భరత్ గట్టిగా అనుకుంటున్నారట. ఈమేరకు చంద్రబాబు వద్దకు సిగ్నల్స్ కూడ పంపారట. అవసరమైతే అల్లుడి కోసం బాలకృష్ణ రంగంలోకి దిగినా దిగవచ్చనే మాటలు వినబడుతున్నాయి. అయితే భరత్ కోరికను చంద్రబాబు ఒప్పుకుంటారా లేదా అనేది ఇప్పుడు సప్పెన్స్. కొందరు మాత్రం భీమిలి నుండి పోటీకి దిగితే శ్రీ భరత్ గెలవడం ఖాయమని అప్పుడు బాబు వారసుడు లోకేష్ పరిస్థితి ఏమిటని అంటున్నారు. భరత్ సహా లోకేష్ కూడ నెగ్గితే పర్వాలేదని, ఒకవేళ భరత్ గెలిచి లోకేష్ ఓడితే ఇంకేమైనా ఉందా.. బాబుగారి పరువు పోదా అనుకుంటున్నారు.
నిజమే.. వారి మాటల్లో కూడ లాజిక్ ఉంది. ఇప్పటికే చంద్రబాబు కుమారుడి హోదాలో పోటీకి దిగి ఒకసారి ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. రెండవసారి కూడ ఓడిపోతే అది కూడ శ్రీ భరత్ గెలిచి లోకేష్ ఓడిపోతే మిగిలి ఉన్న ఆ కాస్త పరువు కూడ పోతుంది. అందుకే చంద్రబాబు భరత్ కోరికను మన్నిస్తారా లేదా అనేది చర్చనీయాశంగా మారింది.