విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్: అంతా సిద్ధమయిపోయినట్టేనా.?

Visakha Executive capital

Visakha Executive capital

సచివాలయం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. శాఖాధిపతుల కార్యాయాలు వంటివన్నీ అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియలే. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా అంత తేలిగ్గా అయిపోయే వ్యవహారం కాదు. కానీ, ‘ఏ క్షణంలో అయినా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ఏర్పాటవ్వొచ్చు..’ అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మంత్రులు ప్రకటనలు ఇస్తున్నారంటే ప్రభుత్వం చెబుతున్నట్టే లెక్క. నిన్న రాజమండ్రిలో పర్యటించిన మంత్రి బొత్స సత్యనారాయణ, మూడు రాజధానుల విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు కోసం సిద్ధంగా వున్నామనీ, ఏ క్షణాన అయినా తరలింపు జరగొచ్చని జోస్యం చెప్పారు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో వుంది. త్వరలో రోజువారీ విచారణ జరగనుంది.

అంటే, విచారణ సందర్భంగా తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గట్టి నమ్మకంతో వుందన్నమాట. అయితే, హైకోర్టు తీర్పు ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వున్నా, దాన్ని అప్పీల్ చేసుకునేందుకు అవకాశం వుందనీ, సుప్రీం కోర్టు మెట్లెక్కే అవకాశం కూడా తమకుందని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు అంటున్నారు. సో, అంత తేలిగ్గా పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలించే వ్యవహారం కాదు. కర్నూలు విమానాశ్రయాన్ని రెండోసారి ప్రారంభించిన సందర్బంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ ప్రస్తావన తీసుకొచ్చారు. అంతకు ముందే హైకోర్టు నిర్మాణం గురించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇవన్నీ అధికార పార్టీ పదునైన రాజకీయ వ్యూహానికి నిదర్శనంగా మాత్రమే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్షాల్ని నిర్వీర్యం చేసే క్రమంలో వస్తున్న ప్రకటనలు తప్ప, మూడు రాజధానులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నది కొందరి అభిప్రాయం. అదే సమయంలో విపక్షాలు గనుక అడ్డుపడకపోయి వుంటే, ప్రస్తుతం రాష్ట్రానికి మూడు రాజధానులు వుండేవనీ, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది వుండేదనే వాదనలూ లేకపోలేదు.