ఐపీఎల్ 2021 .. మెగా ఆక్షన్.. కొత్త టీమ్స్‌తో ఈ ఏడాది ఐపీఎల్ గ్రాండ్‌గా జరగాల్సి ఉండగా కరోనా కారణంగా అదంతా కుదర్లేదు. అయితే ఫ్రాంచైజీల కోసం మినీ ఆక్షన్ నిర్వహిస్తోంది బీసీసీఐ. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే ఈ వేలం కోసం క్రికెటర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో 1,114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. మొత్తం 292 మందికి అనుమతి దక్కింది. ఈ లిస్టులో 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో కేవలం ఇద్దరే ఇద్దరు దేశీ ఆటగాళ్లకు చోటు లభించగా.. ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. ఇందులో హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్‌ను చేర్చారు. అలాగే మరో ఎనిమిది విదేశీ క్రికెటర్లను సైతం రూ.2కోట్ల బేస్‌ప్రైస్ జాబితాలో చేర్చారు. ఇందులో గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ ఉన్నారు. అయితే , ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్, డేవిడ్ మాలన్‌లపై ఫ్రాంచైజీలు గురి సాధించినట్లు సమాచారం.
ఇదిలా వుంటే.. రూ.1.5 బేస్‌ప్రైజ్ కేటగిరిలో 12 మందిని, రూ.కోటి కేటగిరిలో హనుమ విహారి, ఉమేశ్‌యాదవ్ సహా 11 మందిని చేర్చారు. అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్ తనయుడు అర్జున్‌కు సైతం వేలంలో చోటు కల్పించారు. ఈ మినీ వేలంలో పలు ఫ్రాంచైజీలు తన తుది జట్టు కూర్పుకు మెరుగులు దిద్దనుండగా.. మరికొన్ని భారీ మార్పులు చేయనున్నాయి