ఎవరన్నా సాయం అడిగితే చాలు, ‘మీరేం ఆందోళన చెందాల్సిన పనిలేదు.. మీ సమస్య తీరిపోతుంది..’ అని భరోసా ఇస్తున్నాడు సోనూ సూద్. ఇదెలా సాధ్యమవుతోంది.? ప్రభుత్వాలు చెయ్యలేని పనిని, సోనూ సూద్ ఎలా చేయగలుగుతున్నాడు.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది. నో డౌట్, సోనూ సూద్ చాలామందికి సాయం చేయగలుగుతున్నాడు. అదే సమయంలో, ఇంకా చాలామంది సాయం కోరుతున్నా, వారికి తాను సాయం చేయలేకపోతున్నట్లు స్వయంగా సోనూ సూద్ పలు సందర్భాల్లో చెప్పాడు.
1000 మంది నుంచి అభ్యర్థనలు వస్తోంటే, 100 మంది సమస్యల్ని కూడా తీర్చలేకపోతున్నాడు సోనూ సూద్. అయినాగానీ, సాయం అందుకున్న ఆ వంద మందీ జీవితాంతం తాము సోనూ సూద్‌కి రుణపడి వుంటామంటున్నారు. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడాల్లేకుండా సోనూ సూద్ మెలకువగానే వుంటున్నాడు వీలైనంత ఎక్కువ సమయం. ఎందుకంటే, దేశవ్యాప్తంగా తన నుంచి సాయం అందిస్తోన్నవారి సంఖ్య అంత ఎక్కువగా వుంటోంది కాబట్టి. వీలైనంతమందికి సాయం చెయ్యగలుగుతున్నాడు. ఇంకా ఎక్కువమందికి సాయపడలేకపోతున్నందుకు బాధగా వుందని అంటున్నాడు.
కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.. కానీ, అంతలోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని బాధపడ్డ సోనూ సూద్, అదే సమయంలో ఇంకో వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇంతలా సాయపడేందుకు సోనూ సూద్ ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తున్నాడు.? ఇదే ఎవరికీ అర్థం కావడంలేదు. రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు.. ఇలా అదీ ఇదీ అని కాదు.. ఏ సాయం అడిగినా చేసేస్తున్నాడు.
విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం కూడా సాయం చేస్తున్నాడు. తాజాగా ఐఏఎస్ చదవాలనుకునేవారికి ఉచిత కోచింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు సోనూ సూద్. ఔను, సోనూ సూద్ అంటే సూపర్ మేన్. 130 కోట్లమంది జేజేలు అందుకుంటున్న సోనూ సూద్.. అసలు సిసలు భారత జాతి రత్నం.