హై వోల్టేజ్ మ్యాచ్‌ల్లో ఒకటైన ఇండియా-పాకిస్థాన్ పోరు ఎప్పుడూ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఆసియా కప్ లోభాగంగా ఆదివారం జరిగిన టీ20 పోరులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు, టీమిండియా బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ కోల్పోవడం పాక్‌కు షాక్ ఇచ్చింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌లో సెయిమ్ ఆయూబ్ డకౌట్ కావడంతో పాకిస్థాన్ బ్యాటింగ్ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది.
ఓపెనర్ షాహిబాజా ఫర్హాన్ (40) కొంత ప్రతిఘటన చూపించినా, మరోవైపు వికెట్లు వరుసగా కూలిపోయాయి. ఫకర్ జమాన్ (17), షాహిన్ అఫ్రిది (33) తప్ప మరెవ్వరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. చివర్లో షాహిన్ వరుస బౌండరీలతో స్కోరును కొంత గౌరవప్రదంగా నిలబెట్టాడు. కానీ నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి పాక్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.
భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయలో 3 వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు.బౌలింగ్ వేరియేషన్స్‌తో పాక్ బ్యాటర్లను ఇబ్బందుల్లోకి నెట్టిన టీమిండియా బౌలింగ్ యూనిట్ ఘన విజయం సాధించింది. ఇక టార్గెట్ 128 పరుగులే కావడంతో టీమిండియా బ్యాటర్లకు ఇది పెద్ద సమస్య కాకూడదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ హిట్టర్లు, ఫార్మ్‌లో ఉన్న టాప్ ఆర్డర్ ఉన్నందున ఈ లక్ష్యం సులభంగా చేధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
