ఆసీస్ గడ్డపై అదరగొట్టిన భారత బౌలర్స్ స్వదేశానికి వచ్చే సరికి పెద్దగా ప్రతిభ కనబరచలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్‌ను ఔట్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. ముఖ్యంగా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, హిట్టర్ బెన్ స్టోక్స్ విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ 578 పరుగులకు ఆలౌట్ అయింది. ఆకలి మీద ఉన్న సింహం జింక పిల్లను వేటాడినట్టు జో రూట్ భారత బౌలర్స్ సహానాన్ని పరీక్షించాడు. వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ (377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేసి కదం తొక్కాడు. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (118 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సారథికి చక్కటి సహకారం అందించాడు.
ఓ వైపు పసలేని బౌలింగ్, మరోవైపు క్యాచ్‌లు జారవిడవడం ఇంగ్లండ్‌కు బాగా కలిసొచ్చింది. శనివారం రోజు టీ విరామం తర్వాత పోప్‌ను అశ్విన్ ఔట్ చేయగా.. నదీమ్ వేసిన తదుపరి ఓవర్‌లో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో భారత బౌలర్స్ మిగతా బ్యాట్స్‌మెన్స్‌పై ప్రెషర్ పెంచేందుకు కృషి చేశారు. ఇందులో భాగంగా ఇషాంత్ వరుస బంతుల్లో బట్లర్, ఆర్చర్ (0)ను వెంటవెంటనే ఔట్ చేశాడు. ఆ తర్వాత డామ్ బెస్ (28), జాక్ లీచ్ (6) క్రీజులో ఉండి మరో వికెట్ కోల్పోకుండా రెండో రోజు ముగించారు.
ఓవర్ నైట్ స్కోరు 555/8 తో మూడో రోజు కొనసాగించిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్స్ నిలువరించాడు. తక్కువ పరుగుల వ్యవధలోనే బెస్, ఆండర్సన్ వికెట్స్ తీయడంతో ఇంగ్లండ్ 578 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టగా 19 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 6 పరుగుల స్కోరు చేసి ఆర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో భారత్‌కు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. కాగా, భారత బౌలర్స్‌లో అశ్విన్, బుమ్రా చెరో మూడు వికెట్స్ తీయగా, నదీమ్ రెండు వికెట్స్, ఇషాంగ్ రెండు వికెట్స్ తీసారు.