సినీ నటుడు సోనూ సూద్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారుల గురిపెట్టారు. ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్ళలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ‘ఇది అన్యాయం.. అక్రమం..’ అంటూ సోనూ సూద్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో చేతికి ఎముక లేదన్నట్టు సోనూ సూద్, సాయం కోరినవారందరికీ సాయం చేసేందుకు ప్రయత్నించాడు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇరుక్కుపోయినవారిని వారి స్వస్థలాలకు పంపేందుకు రకరకాల వాహనాలు ఏర్పాటు చేశాడు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేయించాడు సోనూ సూద్. ఆర్థిక ఇబ్బందులతో వున్నవారికి ఆర్థిక సాయం చేశాడు.. ఉద్యోగాలు కోల్పోయినవారికి ఉపాధి అవకాశాలు కల్పించాడు.. కొన్ని సంస్థల్లో ఉద్యోగాలు కూడా వేయించాడు. వ్యవసాయం చేసుకోడానికి ట్రాక్టర్లను అందించాడు. వాట్ నాట్.. సోనూ సూద్ చేసిన సేవ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, అవసరమైన మందులు.. ఇలా సోనూ సూద్ చాలానే చేశాడు. కొందరు పేషెంట్లను ఎయిర్ లిఫ్ట్ చేయించి.. ఖరీదైన చికిత్స కూడా చేయించాడు. సోషల్ మీడియాలో సోనూ సూద్‌ని ట్యాగ్ చేస్తే చాలు.. కష్టాలు తీరిపోయినట్లేనన్న భావన దేశవ్యాప్తంగా చాలామందిలో పెరిగింది. అంతలా సాయం చేసిన సోనూ సూద్, అంత సొమ్ము ఎలా సంపాదించాడు.? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఈ నేపథ్యంలోనే ఐటీ సోదాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ‘ప్రభుత్వమెలాగూ ప్రజల్ని ఆదుకోదు.. సేవ చేసేవారిని కూడా ఇలా అడ్డుకుంటారా.? కక్ష సాధింపు చర్యలకు దిగుతారా.?’ అని జనం ప్రశ్నిస్తున్నారు. తన ఆస్తుల్ని తనఖా పెట్టి, అమ్మేసి.. సోనూ సూద్ సేవా కార్యక్రమాలు చేసిన వైనం గురించి మీడియాలోనే వార్తలు విన్నాం. మరి, ఈ ఐటీ దాడులెందుకు.?