టాలీవుడ్‌లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దాడుల ప్రభావం ఇంకా తగ్గలేదు. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇంటి సహా ఆయన బంధువుల నివాసాల్లో ఇటీవల ఐటీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ దాడుల అనంతరం రాజును విచారణకు పిలిపించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ పూర్తయ్యాక రాజును విడుదల చేసినా, మరోసారి పత్రాలతో హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం దిల్ రాజు పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లు తీసుకుని ఐటీ కార్యాలయానికి వెళ్లారు. దీనితో ఈసారి విచారణ మరింత గడువు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐటీ దాడులపై రాజు తొలుత హుందాగా స్పందించినా, అధికారుల దృష్టి మరింత లోతుగా కొనసాగుతుండటంతో ఆయనపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. రాజు ఆస్తుల వ్యవహారంపై బంధువులను కూడా విచారించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సంక్రాంతికి మంచి వసూళ్లు రాబట్టిన మూడు సినిమాల్లో దిల్ రాజు భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. రెండు చిత్రాలకు నిర్మాతగా, ఒక చిత్రానికి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించడంతో భారీ లాభాలు సాధించినట్టు ఊహాగానాలు ఉన్నాయి. అయితే, ఆ ఆదాయానికి తగినంత పన్ను చెల్లించలేదన్న అనుమానంతోనే ఐటీ దాడులు జరిగాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
దాదాపు మూడు రోజుల పాటు కొనసాగిన ఐటీ దాడుల అనంతరం అధికారులు రాజు కార్యాలయాల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇకపై ఐటీ శాఖ విచారణ ఎలా సాగుతుందన్నదానిపై టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది. దిల్ రాజు ఈ దర్యాప్తు నుంచి ఎప్పుడు బయటపడతారో వేచిచూడాలి.