సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ రాజాకు అస్వస్థత … హాస్పిటల్ కి తరలింపు !

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డి. రాజా అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాలకు హాజరైన రాజా స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే నాయకులు ఆయన్ను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.

కాగా.. డి. రాజా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో రాజా అస్వస్థతకు గురయ్యారని, వైద్యం అందిస్తున్నామని కామినేని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. సమావేశాలకు ముందురోజే పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా హైదరాబాద్‌కు వచ్చారు. జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్‌ అంజన్‌, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదిలాఉంటే.. సీపీఐ జాతీయ సమావేశాలు హైదరాబాద్‌లో మఖ్దూం భవన్‌లో శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో మొదటి రోజున పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాల్లో త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై దృష్టి పెట్టాలని కార్యవర్గం తీర్మానించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల కేడర్ ఎన్నికల కోసం సమాయత్తం కావాలని నాయకులు సూచనలు చేశారు.