కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఆరోగ్య శాఖను తాజాగా ఓ విషయమై ఆదేశించినట్లు తెలిసింది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ల పై ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోలను తొలగించమని ఆదేశించినట్లు తెలిసింది. ఇది అన్ని రాష్ట్రాల్లో కాదు, త్వరలో ఎన్నికలు జరగబోయే నాలుగు రాష్ట్రాలు ప్లస్ పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రమే. ఎందుకూ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆదేశించినట్లు ది ప్రింట్ తెలిపింది.
ఈ కొత్త ఆదేశం వెనక తృణమూల్ కాంగ్రెస్ ఉంది అని తెలిసింది. పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మ ఉండటం, ఎన్నికల కోడ్ నియమాల ఉల్లంఘనే అని అక్కడి ఎన్నికల సంఘానికి మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ కంప్లైంట్ ఇవ్వడంతో అది కాస్తా గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. కట్ చేస్తే ఆదేశాలు జారీ. కేంద్ర ఎన్నికల సంఘం… రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని… తృణమూల్ చేసిన ఆరోపణలో నిజానిజాలు తేల్చాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న రాష్ట్ర సీఈ… ఈ కంప్లైంట్ పైనా ఫోకస్ పెట్టనుంది.
తాజా ఆదేశంతో తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరిలో కరోనా వ్యాక్సినేషన్ లను మార్చాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక యంత్రాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తృణమూల్ ఆరోపించింది. కరోనా వ్యాక్సిన్ ద్వారా కూడా మోదీ క్రెడిట్ కొట్టేయాలని యత్నిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ ఆరోపించారు. ఈ ఆరోపణలన్నింటినీ ఆధార రహితమైనవిగా బీజేపీ కొట్టిపారేసింది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమం… ఎన్నికల ప్రకటనకు ముందే ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్లో మార్పులు అవసరం లేదు… అని సమర్థించుకుంది. ఐతే… ఈసీ ఆదేశాలతో ఇప్పుడు వ్యాక్సినేషన్ కొనసాగుతుంది కానీ… ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రం కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండదు.