కులాలు, మతాల పేరిట రాజకీయాలు చేయడం మన నాయకులకు అలవాటు. నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉన్న కుల, మత రాజకీయాలు ఇప్పుడు ఏపీలో ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో హిందు దేవాలయాలపై జరుగుతున్న దాడులను బీజేపీ నాయకులు, టీడీపీ నాయకుల రాజకీయం చేయాలని చూస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డికి హిందు మతాలన్న, దేవాలయాలన్నా గౌరవం లేదని, అందుకే దేవలయాలపై దాడులు జరుగుతున్నా కూడా జగన్ మోహన్ రెడ్డి స్పందించడం లేదని ప్రతిపక్షాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డికి మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని జగన్ సరిగ్గా వాడుకుంటే ప్రతిపక్షాల నాయకులు నోరు మూసుకోవలసిందేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
జగన్ కు వచ్చిన అవకాశం ఏంటి?
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామికి తిరుమలలో పట్టు వస్త్రాలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమర్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అత్యద్భుతమైన అవకాశం దొరికింది. తిరుమల దర్శనం సందర్భంగా ‘వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం వుంది’ అంటూ డిక్లరేషన్‌పై సంతకం చేసేస్తే.. మొత్తం వివాదం సద్దుమణిగిపోతుంది. జగన్ మోహన్ రెడ్డి ఈ ఒక్క పని చేస్తే ప్రతిపక్షాల నాయకుల నోళ్ళకు కళ్లెం వేయవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న మత కలహాల వల్ల జగన్ మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని వదులుకోడని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ పై సంతకం చేయలేదు.
మతాల పేరిట రాజకీయాలు చేయడం తగునా!
ఏ మతాన్నైనా అగౌరవ పరచడం, ఆ మతం యొక్క ఆలయాలను, ఆ మతం యొక్క పుస్తకాలను ఆగౌరవపరచడం తగదు. అయితే ఒక ఘటన ఎలా జరిగిందో అధికారులు నిర్దారించకుండానే ఒక పార్టీ నేతలపై, ముఖ్యమంత్రిపై నిందలు వేయడం, ఆ ఘటనను రాజకీయం చేయడం కూడా తప్పే. కులాలు, మతాలు అనే అంశాలు చాలా సున్నితమైనవి, ఒక్కసారి అలాంటి వాటిని టచ్ చేస్తే జరిగే పరిణామాలు మన ఊహలకు కూడా అందవు. అందుకే ఇలాంటి సున్నితమైన విషయాల్లో రాజకీయ నాయకులు సంయమనం పాటించాలి.