వైఎస్ జగన్ ఏదైనా అనుకుంటే చేసి తీరుతారనే పేరుంది. ఎంతటి కష్టమైనా, ఎన్ని ఇబ్బందులొచ్చినా వెనుకాడనిది ఆయన నైజం. ఆ నైజమే ఆయన్ను పాతాళ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థానం వరకు తీసుకొచ్చింది. ఇప్పటివరకు జగన్ అనుకుని చేయలేకపోయిన పనులు పెద్దగా లేవు. కొన్ని పూర్తవ్వగా ఇంకొన్ని జరిగే ప్రాసెస్లో ఉన్నాయి. జగన్ చేస్తున్న పనులు చూస్తే విషయం తెలియని ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ఎంతటి ధనిక రాష్ట్రమో అనుకుంటారు. కానీ మన దగ్గర ఖజానా అంతా ఖాళీయే. ఏది చేయాలన్నా కొత్తగా అప్పులు వెతకాల్సిందే. ఇప్పటికే పోలవరం, కొత్తగా చెబుతున్న మూడు రాజధానుల ఏర్పాటుకే నిధులు లేక అల్లాడుతున్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జగన్ కొత్త జిల్లా ఏర్పాటును మొదలుపెట్టారు. అన్ని పరిశీలనలు పూర్తి చేసి నివేదికను, ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకున్నారు. 13గా ఉన్న జిల్లాలకు కొత్తగా 12 కలుపుకుని మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వాటిని 32 జిల్లాలు చేయాలనే ఆలోచన ఉంది ఆయనలో. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు వలన కేంద్రం నుండి నిధులు రావడం, పరిపాలన సులభతరం కావడం లాంటి మంచి ప్రయోజనాలున్న మాట వాస్తవమే కానీ జిల్లాల ఏర్పాటు చేయడమనేది అతి పెద్ద కష్టం. కొత్త జిల్లాలు అంటే దాదాపు అన్నీ కొత్తవే ఉండాలి. అందుకు బోలెడంత ఖర్చవుతుంది.
ఈ ఖర్చుకు భయపడే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త జిల్లాల ప్రస్తావనను పక్కనబెట్టారు. అధికారులు చెబుతున్న లెక్కల మేరకు ఈ ప్రక్రియకు 1500 నుండి 2000 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. అయితే ఇది అంచనా మాత్రమే. 32 జిల్లాలు అంటే ఆ ఖర్చు మరింత పెరిగిపోతుంది. అంతెందుకు పక్క రాష్ట్రం తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటులో ఎన్ని కష్టాలు పడిందో అందరం చూశాం. హైదరాబాద్ లాంటి భారీ ఆదాయ వనరు ఉన్న తెలంగాణకే ఆ భారం నుండి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. అలాంటిది ఆదాయమనేది కనుచూపు మేరలో కూడ లేని ఏపీకి ఇంకెంతటి గడ్డు పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు.
కొత్త జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు, కొత్త జిల్లా పోలీస్ కార్యాలయాలు, అగ్నిమాపక కార్యాలయాలు, కొన్ని కొత్త పోలీస్ కాంప్లెక్సులు, కొత్త పోలీస్ కమీషనరేట్లు, అన్ని విభాగాల అధికారులకు కార్యాలయాలు, అదనపు పాఠశాలలు, ఇంకా మరెన్నో ప్రభుత్వ భవనాలు, కొత్త కనెక్టివిటీ మార్గాలు, కొత్త పోలీస్ స్టేషన్లు, ప్రతి జిల్లాకు ప్రత్యేక రవాణా సముదాయాలు, గ్రామపంచాయతీలు, పోలీస్ సర్కిళ్లు ఇలా ఎన్నింటినో కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎంత పొదుపుగా వెళ్లినా వీటన్నింటికీ భారీగానే ఖర్చవుతుంది. అసలే రెవెన్యూ లోటు, పోలవరం, సంక్షేమ పథకాలు లాంటి అత్యవసరాలు ఉండగా జగన్ ఈ కొత్త జిల్లాలను ఏర్పాటును సమర్థవంతంగా చేయగలిగితే మాత్రం జగన్ హీరో అయిపోతారు.