ఆ నేత ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి మాటలు వస్తాయో మీడియాతో పాటు పొలిటికల్ లీడర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయనే అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేసిన జేసీ దివాకర్ రెడ్డి.. ఇప్పుడు తన సొంతంపార్టీపై, పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తతం తెలుగుదేశంలో ఉన్న ఆయన.. ఆ పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబుపైనే హీట్ పుట్టించే కామెంట్స్ చేశారు. ఇప్పుడు జేసీ వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చేసిన కామెంట్స్ ఒక విధంగా టీడీపీ, చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు, ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితిని తనదైన స్టైల్లో వివరించారు జేసీ. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని తాను చంద్రబాబు ఎంతచెప్పినా పట్టించుకోలేదని బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అన్ని రకాలుగా టీడీపీని అడ్డుకొని పంచాయతీలను సొంతం చేసుకుంటారని హెచ్చరించినా చంద్రబాబు మొండిగా ముందుకెళ్లారరని జేసీ అన్నారు. ఇక చంద్రబాబుపై కేసులు నమోదు చేయడం ఆలస్యమైందన్న జేసీ దివాకర్ రెడ్డి.. ఇంత లేట్ అవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ కు తాను ప్రధమ శత్రువును కాదన్న ఆయన.. తాను చంద్రబాబును ద్వేషించే వ్యక్తినన్నారు.
అయితే , జగన్-చంద్రబాబుల్లో ఎవరు బెటర్ అని ఆలోచించుకొని విధిలోని పరిస్థితుల్లోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు చంద్రబాబు విజన్ ఉన్న నేత అని అందుకే ఆయనంటే తనకు అభిమానమంటూ తమ్ముళ్లకు కాస్త ఊరటనిచ్చే కామెంట్స్ చేశారు. త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికపైనా జేసీ తనదైన శైలిలో మాట్లాడారు. తిరుపతిలో గెలుపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు వైసీపీదేనన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నేతలకు కూడా జేసీ ఓ సలహా ఇచ్చారు. ఏపీలో బీజేపీ బతికి బట్ట కట్టాలంటే ఒకేఒక్క మార్గముందన్నారు. చంద్రబాబుతో జతకడితేనే బీజేపీకి లైఫ్ ఉంటుందన్నారు. టీడీపీతో పాటు బీజేపీని షేక్ చేసేలా మాట్లాడిన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై చంద్రబాబు స్పందిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.