ఐకాన్ సార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా.. అమెరికాలో జరిగిన ‘ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ 2022’ కి ఈ ఏడాది గ్రాండ్ మార్షల్ హోదాలో భారతదేశం నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాతినిధ్యం వహించారు. సతీమణి స్నేహతో కలిసి ఈ ఈవెంట్ కు హాజరయ్యారు అల్లు అర్జున్.
దీనికి అత్యధిక స్థాయిలో ప్రవాసులు హాజరై.. భారతదేశం పట్ల ఉన్న దేశభక్తిని.. అల్లు అర్జున్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఏ సంవత్సరం కూడా ఇంతమంది హాజరు కాలేదని, పెరేడ్ కు ఇంతమంది ప్రవాస భారతీయులు రావడం ఒక రికార్డుగా అభివర్ణిస్తున్నారు ప్రతినిధులు. 2022లో ఓ ఈవెంట్ కోసం 5 లక్షల మంది బయటకు రావడం ఇదే మొదటిసారి. మువ్వన్నెల భారత జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ న్యూయార్క్ వీధుల్లో విహరించారు అల్లు అర్జున్. ఆయనను చూడడానికి అభిమానులు భారీగా హాజరయ్యారు. తగ్గేదేలే.. జైహింద్ అంటూ ప్లకార్డులు పట్టుకొని చూపించారు. అందరినీ ప్రేమతో పలకరిస్తూ అభిమానులతో ముచ్చటించారు అల్లు అర్జున్. అనంతరం న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్.. అల్లు అర్జున్ ను సన్మానించారు. కాసేపటి భేటి తర్వాత ఇద్దరూ కలిసి తగ్గేదే లే సిగ్నేచర్ మూమెంట్ చేశారు.