IAF Helicopter Crash : భారత వాయు సేనకు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. భారత వాయుసేన చరిత్రలోనే దీన్నొక అతి పెద్ద ప్రమాదంగా అభివర్ణిస్తున్నారు రక్షణ రంగ నిపుణులు. అందుక్కారణం, ఆ హెలికాప్టర్‌లో ప్రయాణించింది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కావడమే. మొత్తం 14 మంది ప్రయాణ సమయంలో ఆ హెలికాప్టర్‌లో వున్నారు.
కాగా, ప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామాల్లోని ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. తమిళనాడులోని ఊటీ కొండల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సతీమణి అలాగే భద్రతా సిబ్బంది ఈ హెలికాప్టర్‌లో వున్నారు.
హెలికాప్టర్ పెద్ద శబ్ధంతో నిప్పులు చిమ్ముతూ కిందికి పడిపోయిందనీ, పడిపోయాక పెద్దయెత్తున మంటలు చెలరేగాయనీ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో హెలికాప్టర్‌లో ప్రయాణించేవారు బతికి బట్టకట్టడం అనేది చాలా అరుదు.
అయితే, బిపిన్ రావత్ ప్రాణాలతో బయటపడినట్లే కనిపిస్తోంది. తీవ్ర గాయాలపాలైన బిపిన్ రావత్‌ని భద్రతా సిబ్బంది అక్కడి నుంచి తరలిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, 80 శాతం మేర కాలిన గాయాలతో ఆయన బాధపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
జాతీయ విషాదంగా ఈ ఘటనను అభివర్ణిస్తున్నారు. త్రివిధ దళాలకు సంబంధించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా 2019లో బిపిన్ రావత్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.