టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారానికి దాదాపుగా తెరదించారు. వచ్చే పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, తన ఆరోగ్యంగా బాగానే ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.సీఎం పదవి విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సంయమనం పాటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఒకవేళ ఆరోగ్యం సహకరించని రోజు తానే చెబుతానని పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పారు. అప్పుడు ఎవర్ని సీఎం చేయాలన్నదానిపై మిమ్మల్నే అడుగుతానని అన్నారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పిన కేసీఆర్.. ఇకపై సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడకూడదంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాలో వస్తున్న వార్తలను కూడా ప్రస్తావించారు. మంత్రి కత్తి పద్మారావు, బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా ఇటీవల కేటీఆర్ సీఎం అవుతారంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపైనా సీఎం కేసీఆర్ స్పందించారు. ఇక ఏప్రిల్ నెలలో టీఆర్ఎస్ బహిరంగ సభ ప్లీనరీ ఉంటుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఫిబ్రవరి 12 నుంచి పార్టీ సభ్య నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఎమ్మెల్యే 50వేల సభ్యత్వం నమోదు చేయించాలని ఆదేశించారు. మార్చి నుంచి పార్టీ కమిటీల నియామకం జరుగుతుందన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు సీల్డ్ కవర్లలో అందించడం జరుగుతుందన్నారు.