Sreekanth: మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి, అవతలి వర్గం గెలవడానికి ప్రత్యేకమైన కారణాలేమీ లేవని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. తన జీవితంలో ఇప్పటివరకూ సినిమాల విషయంలో ఎన్నో ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కొన్నాన్న ఆయన, ఈ విషయంలోనూ తాను ఏం ఫీల్ కాలేదని ఆయన చెప్పారు. అంతకుముందు కూడా తాను ఓడిపోయానని, కానీ ఈ సారి నమ్మి ఓటు వేశారు గెలిచానని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేశాను అది వేరే విషయం అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
ఇక తామందరం రాజీనామా చేసే ముందు అందరం అనుకొనే రాజీనామా చేశామని ఆయన స్పష్టం చేశారు. అటు సగం, ఇటు సగం అనేది అస్సలు వర్కవుట్ కాదన్న ఆయన, ముందే పెద్దవాళ్లందరూ కలిసి కూర్చొని సింగిల్‌గా చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. అటు వైపు కొంతమంది, ఇటు వైపు కొంతమంది ఉండడం వల్ల పోయిన సారి ప్రాబ్లమ్ అయిందని ఆయన చెప్పారు. ఎందుకంటే ఏ పనులు చేయకపోయినా అవతలి వర్గంపైనా తోసేసేవారని, అలా ఒకరి మీద ఒకరికి కోపాలు పెరిగేవే గానీ, పనులు మాత్రం జరిగేవి కావని ఆయన తెలిపారు.
నరేష్ గారు చేసిన ఒక్క సంఘటనే తప్ప, ఆయనకీ, తనకూ మధ్య ఏం గొడవా లేదని శ్రీకాంత్ చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో పాలిటిక్స్ ఎలా ఉంటాయో అలా చేశారని, ఎన్నికలు కూడా అదే తరహాలో జరిపారని ఆయన అన్నారు. దాంతో అసలు ఎన్నికల మీదే చిరాకు వచ్చిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే అసలు ఎన్నికల్లో నిల్చోవద్దని అనుకున్నానన్న ఆయన, కొన్ని అనివార్య కారణాల వల్ల నిలబడాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.