Koti: దాసరి గారు తీసిన అన్ని సినిమాలకు తానే మ్యూజిక్ చేసేవాడినని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కోటి అన్నారు. కానీ తామిద్దరి మధ్య విబేధాలొచ్చాయని, అసలు అవి ఎక్కడ, ఎందుకు వచ్చాయనేది కూడా తనకు ఇప్పటికీ తెలియదని ఆయన చెప్పారు. ఒక్కసారిగా తనకు సినిమాలు ఇవ్వడం మానేశాడని, తనను కలవడం ఆపేశారని కోటి తెలిపారు. ఎవరో పక్కన వాళ్లు చెప్పిన మాటలు విని అలా చేశారా, లేదంటే ఇంకో కారణమా అనేది తనకు క్లారిటీ లేదని ఆయన అన్నారు.
ఇండస్ట్రీలో ఇలా పక్కనే ఉండి వేరొకరి మీద మాటలు చెప్పే వారు చాలా ఎక్కువగా ఉంటారని కోటి తెలిపారు. పనీ, పాట లేనివారు ఇలా టైం చూసుకొని మరీ బ్యాచులుగా చేరి అంత వరకూ మంచిగా ఉన్న దాన్ని చెడగొడతారని ఆయన చెప్పారు. అలా తాను ఇప్పటివరకూ చాలా చూశానని, చాలా ఫేస్ చేశానని కూడా ఆయన తెలిపారు. కాబట్టి చూసీ, చూసీ రాటుదేలానని ఆయన అన్నారు. ఇవన్నీ నెట్టుకొని ఈ రోజు వరకు తాను 500 సినిమాలు చేశానని, ఇవన్నీ చూస్తూ బాధపడుతూ కూర్చుంటే ఇవన్నీ అయ్యుండేవా అని ఆయన ప్రశ్నించారు.
అందుకే ఎవరైనా తమ గమ్యాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలని, మన సంకల్ప బలమే మనల్ని రక్షిస్తుందని ఆయన చెప్పారు. అంతే గానీ వాడు పారేశాడు, ఇలా కిందకు నెట్టేశారు అని డిప్రెస్ అయ్యి కూర్చోకుండా మన పని మనం, మనకేం కావాలో దాని కోసం ప్రయత్నించాలని ఆయన అన్నారు. అందుకే తన మ్యూజిక్ వర్క్ తాను చేసుకుంటూ ఉంటానని కోటి తెలిపారు. ఇండస్ట్రీలో అంత పెద్ద డైరెక్టర్ అయిన తనతో విభేదాలు పెట్టించారని ఆయన మరోసారి చెప్పారు. ఆయన చనిపోయినపుడు కూడా తాను అమెరికాలో ఉండడం వల్ల ఆయన్ని చివరి సారి కూడా చూడలేకపోయానని కోటి ఆవేదన వ్యక్తం చేశారు.