క‌రోనా ముసుగులో కిడ్నీలు కొట్టేస్తున్న ముఠా

రోగం వ‌చ్చింద‌ని ఆస్ప‌త్రికి వెళితే కిడ్నీ కొట్టేశారే

కంచే చేను మేసిన చందంగా కిడ్నీ రాకెట్ లో డాక్ట‌ర్ల హ‌స్తం బ‌య‌ట‌ప‌డ‌డం తెలుగు రాష్ట్రాల‌ ప్రజ‌ల్ని బెంబేలెత్తిస్తోంది. ఓవైపు క‌రోనా విల‌యం నేప‌థ్యంలో ఈ ముసుగును ఉప‌యోగించుకుని హైద‌రాబాద్ న‌గ‌రంలో కిడ్నీ వ్యాపారం గుట్టుగా సాగుతోంద‌ని స‌మాచారం. ఈ రాకెట్ కిడ్నీ వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ గా విస్త‌రించి ఉంద‌న్న అనుమానాల్ని పోలీసులు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక క‌రోనా టెస్టింగ్ కోస‌మ‌ని వచ్చే రోగుల‌ను సైతం ఈ కిడ్నీ ముఠా దారి మ‌ళ్లించే ప్ర‌మాదంపైనా పోలీసులు ఆరాలు తీస్తున్నారు. తాజాగా కిడ్నీ రాకెట్‌కు సంబంధించి ఎంబీఏ విద్యార్థిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని రోజుల తరువాత, ఈ రాకెట్టులో పాల్గొన్న నగర వైద్యులను గుర్తించే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

అనారోగ్యంతో ఉన్న తన భర్తకు కిడ్నీ దాతను అందించే నెపంతో వనస్థాలిపురానికి చెందిన డి పవన్ శ్రీనివాస్ (25) ఒక మహిళ నుంచి రూ.34 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. శ్రీలంక – టర్కీలో కిడ్నీ మార్పిడి సమాచారం కోసం శ్రీనివాస్ నగరానికి చెందిన కొంతమంది వైద్యులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దాత వివరాలను ఇచ్చినందుకు బదులుగా, శ్రీనివాస్ నగరానికి చెందిన వైద్యులకు కమీషన్ ఇస్తాడు. దాతలు, వైద్యుల వివరాలు పొందడానికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నార‌ని తె‌లుస్తోంది.