తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త సచివాలయం నిర్మాణం, ఖర్చు, ఇతర వివరాలకు సంబంధించి అధికారుల నుంచి క్లారిటీ వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా కొత్త సచివాలయ నిర్మాణానికి విడుదల చేసిన బడ్జెట్ గురించి, ఖర్చు చేసిన మొత్తం గురించి, ఇప్పటివరకు అసలు నిర్మాణానికి నోచుకోని కట్టడాల గురించి, ఇతర వివరాల గురించి ప్రశ్నలను సంధించారు.
కరీమ్ అన్సారీ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా రోడ్లు, భవనాల శాఖ అధికారులు కొత్త సచివాలయ నిర్మాణం కొరకు తెలంగాణ సర్కార్ ఇప్పటివరకు 617 కోట్ల రూపాయలను విడుదల చేసిందని విడుదల చేసిన మొత్తంలో 217 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని అధికారులు వెల్లడించారు. సచివాలయ ప్రధాన భవనం, పశ్చిమ, దక్షిణ దిశలలో ఉన్న అనుబంధ భవనాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని అధికారులు చెప్పుకొచ్చారు.
సచివాలయ నిర్మాణ పనులు జులై 31వ తేదీ లోపు పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సమయంలో కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం తక్కువ మొత్తం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న కొన్ని పథకాలు ప్రశంసలను అందుకుంటున్నాయి. రైతుబంధు పథకం వల్ల తమకు ఎంతగానో ప్రయోజనం కలుగుతోందని రైతులు చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న ఈ స్కీమ్ తమ రాష్ట్రాలలో కూడా అమలు చేయాలని చాలామంది రైతులు కోరుకుంటున్నారు. కొన్ని విషయాలలో కేసీఆర్ సర్కార్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.