హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరోసారి వానలు బీభత్సం సృష్టించనున్నాయి. ఇప్పటికే వర్షాలు విరుచుకుపడుతుండగా, రాబోయే 24 గంటల్లో అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అయింది. నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, భద్రాద్రి, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నగరంలో ఇప్పటికే మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే గంటల్లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ వంటి ఐటీ ప్రాంతాల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉండటంతో సైబరాబాద్ పోలీసులు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సూచించారు.
తక్షణ అవసరమైతే తప్పగా ఎవరూ బయటకు రాకుండా చూడాలని.. ఎక్కడివారు అక్కడే ఉండాలని.. బయటకు వెళ్లాల్సి వస్తే అత్యంత జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్‌ల సమస్యలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇక రోడ్డుపై రాంగ్ రూట్లలో ప్రయాణించే వారిపై పోలీసులు కన్నేశారు.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 వద్ద ట్రాఫిక్ అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాంగ్ రూట్‌లో వెళ్తూ ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.
ఇలాంటి వర్షాకాల పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలు తలెత్తడం ఖాయం. అందుకే అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వర్క్ ఫ్రం హోమ్ చేసే వీలుంటే అదే చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలందరూ అధికారులు ఇచ్చే సూచనలను పాటించి అప్రమత్తంగా ఉండాలని, ఆపదలో ఉన్నవారు వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.
