గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు గడిచి పోయాయి. ఇన్ని రోజుల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ ఎం సీ కొత్త కార్పొ రేటర్లు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. సభ్యులంతా 10.45 గంటలలోగా జీహెచ్ ఎం సీ కౌన్సిల్ హాల్ కు చేరుకోవాల్సి ఉంటుంది. 11 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం మొదలవుతుంది.
తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తమకు నచ్చిన భాషలో ప్రమాణస్వీకారం చేయవచ్చు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గత ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ 56 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. 48 వార్డులు గెలిచి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక పాతబస్తీలో మరోసారి సత్తా చాటిన ఎంఐఎం 44 వార్డులు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకే పరిమితమయింది
జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిని అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తార్నాక కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీల్డ్ కవర్‌లో నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌లను పంపించనున్నారు. అంతకుముందు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో కేసీఆర్ తెలంగాణ భవన్‌లో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు హోదాలో మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.